ఎంపీ ఎన్నికల్లోనూ అసెంబ్లీ పోరు వ్యూహమే.. కాంగ్రెస్‌తో సీపీఐ దోస్తీ, ఆ రెండు పదవులు మర్చిపోకండి

byసూర్య | Sun, Apr 21, 2024, 09:12 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించింది. పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం టికెట్ కేటాయించగా.. అక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఘన విజయం సాధించారు. మిగిలిన 118 స్థానాల్లో కమ్యూనిస్టులు హస్తానికి మద్దతుగా నిలవగా కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.


తాజాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎంపీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. సీపీఐ అందుకు అంగీకరించింది. కమ్యూనిస్టులతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సీపీఐ కార్యాలయం మఖ్దూంభవన్‌కు వెళ్లారు. సీపీఐ నేతలు కూనంనేని, అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డిలతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. కలిసి పని చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


బీజేపీ గెలవొద్దన్న ఉద్దేశంతోనే తాము పొత్తు నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల సమయంలో సీపీఐ గౌరవప్రదమైన స్థానాలు తీసుకుంటుందని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల పొత్తు కుదిరిన సమయంలో కాంగ్రెస్‌ ఇస్తామన్న రెండు ఎమ్మెల్సీ పదవుల గురించి సీపీఐ నేతలు భట్టికి గుర్తుచేశారు. చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవులిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేసినట్లు సీపీఐ వర్గాలు వెల్లడించాయి. పొత్తు చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి.. లౌకికవాదాన్ని కాపాడేందుకు కలిసి ప్రయాణించాలని నిర్ణయించామన్నారు. అన్ని లోక్‌సభ స్థానాల్లో సహకరిస్తామని సీపీఐ నేతలు చెప్పారన్నారు. సీపీఎం పోటీ చేస్తున్న భువనగిరి స్థానంలోనూ కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు.


తాము కూడా ఒకటి రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని.. కానీ కొన్ని అనివార్య కారణాలు, బీజేపీకి రాష్ట్రంలో స్థానం ఇవ్వకూడదన్న లక్ష్యం కోసం.. ఇండియా కూటమి మరింత బలపడేందుకు రాష్ట్రంలో పోటీ చేయడం లేదని సాంబశివరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాము కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM