మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా'

byసూర్య | Mon, Sep 23, 2024, 10:14 PM

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కూల్చివేతల పర్వం కొనసాగిస్తోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించనున్నట్లు ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవటంతో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. రాజకీయ ఒత్తిడులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆదివారం అమీన్‌పూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్‌ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.


నల్లచెరువుకు సంబంధించి 4 ఎకరాల బఫర్ జోన్‌లో ఉన్న 50కి పైగా బిల్డింగ్‌లు, అపార్ట్‌మెంట్లను బుల్డోజర్ల సాయంతో నేలమట్టం చేశారు. ఎఫ్టీఎల్‌ పరిధిలోని 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 25 బిల్డింగ్‌లు, 16 తాత్కాలిక షెడ్లను సైతం కూల్చేశారు. అదేవిధంగా అమీన్‌పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ సర్వే నెంబర్ 164లో ఉన్న అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేశారు. ఈ కూల్చివేతల పర్వం ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. అయితే కూల్చివేతలపై కొందరు స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము కొనుగోలు చేసిన స్థలాలు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తెలియదని వాపోయారు. మూడు రోజుల క్రితమే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని.. ఇంతలోనే హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఓ బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు.


'మేం కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు. రిజిస్ట్రేషన్ ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం. అనుమతులు అన్నీ ఉన్నాయని ఇల్లు కొన్నాం. ఇల్లు కూల్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాకయ్యాం. ఏండ్ల తరబడి కష్ట పడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నాం. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని మాలాంటి బాధితులకు న్యాయం చేయాలి.' అని హైడ్రా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ కూల్చివేతలపై కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వం వీరికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ సంస్థల వల్ల జరిగిన తప్పు అని.. ఇంటి నిర్మాణ అనుమతి ఇవ్వడం, ఆస్తిని రిజిస్ట్రేషన్ నమోదు చేయడం, సకాలంలో నిర్మాణాన్ని ఆపడంలో ప్రభుత్వ తప్పిదం ఉందని అంటున్నారు. ప్రభుత్వ అంతర్గత విభాగల వల్ల వచ్చే సమస్యలకు పౌరులకు శిక్ష విధించడం సరి కాదని కామెంట్లు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌ని కూడా జవాబుదారీ చెయ్యాలని.. వాళ్లకి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, నేడు కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మాదాపూర్ కావూరి హిల్స్‌ పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM