బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

byసూర్య | Mon, Sep 23, 2024, 10:19 PM

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తుపాను తరహా సుడిగాలులు బంగాళాఖాతంపై ఉన్నాయన్నారు. వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


నేడు ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. పిడుగులు కూడా పడొచ్చునని బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని అన్నారు.


హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం, నేడు ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రూట్‌లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి బేగంపేట, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి రాణిగంజ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మరోవైపు భారీ వర్షం కురవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో జన జీవనం స్తంభించిపోయింది.


భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నూతన నిర్మాణాలు, శిథిలావస్థ భవనాలకు దూరంగా ఉండాలన్నారు. వరదల్లో రోడ్డు దాటే సాహసం చేయొద్దని.. అత్యవసర పరిస్థితుల్లో 040 21111111నంబర్‌ను సంప్రదించాలని కమిషనర్ ఆమ్రపాలి సూచించారు.



Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM