నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

byసూర్య | Fri, Mar 29, 2024, 08:07 PM

మార్చి చివరి వారంలోనే మాడు పగిలే ఎండలు నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకుంది. భానుడి భగభగలతో తెలంగాణ వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి జనం అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ కుతకుత ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం మరింత పెరిగాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. దస్తూరాబాద్‌లో 43.1 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే.


మొత్తం 11 జిల్లాల్లో 42.1 డిగ్రీలకుపైగా నమోదయినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ తెలిపింది. రాబోయే మూడు రోజుల ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం రాత్రి హైదరాబాద్‌, ఆదిలాబాద్‌లలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో గురువారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. బాలానగర్, కూకట్‌పల్లిలో 42 డిగ్రీలు దాటగా.. అసిఫ్‌నగర్, సరూర్‌నగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కాప్రా, కుత్బుల్లాపూర్‌లో 41 డిగ్రీలు దాటింది.


భాగ్యనగరంలో గురువారం భానుడు నిప్పులు చెరిగాడు. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే భగభగ మండుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు ప్రతాపాన్ని చూపించడంతో.. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.


మండే ఎండలకు తోడు తేమ శాతం తగ్గి అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. చిన్న నిప్పురవ్వ రేగినా పెదఎత్తున మంటలు అంటుకుంటున్నాయి. నగరంలో గత పదిరోజుల్లోనే పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏటా నగరంలో 1300కుపైగా స్వల్ప, 25కిపైగా మధ్యస్థ, 20 తీవ్రస్థాయి ప్రమాదాలు జరుగుతుండగా అందులో 40 శాతం వేసవిలోనే సంభవిస్తున్నాయి. ప్రధానంగా గొడౌన్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, టింబర్‌ డిపోలు, పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.


Latest News
 

పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ Sat, Sep 21, 2024, 01:01 PM
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM