byసూర్య | Wed, Sep 20, 2023, 01:03 PM
ఉమ్మడి వరంగల్ జిల్లా, మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం విషాద సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... పట్టి రాములు, పట్టి మల్లేష్ అన్నదమ్ములు. గ్రామంలో రాములు సుంకరి పని(వీఆర్‌ఏ తరహా) చేసేవాడు. కొన్నేళ్ల క్రితం రాములు మృతి చెందాడు. దీంతో అతడి అల్లుడు నారా ఈశ్వర్, తమ్ముడు మల్లేష్ మధ్య పని విభజన జరిగింది. ఒకొక్కరు తలా కొన్ని రోజుల చొప్పున విధులు నిర్వర్తించేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన అన్నకు సంబంధించిన పని కాబట్టే తానొక్కడినే చేసుకుంటానని మల్లేష్ ఒక్కడే కొనసాగాడు. ఇదే క్రమంలో ఇటీవల వీఆర్‌ఏల సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో మల్లేష్ ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది. దీంతో అతడిపై ఈశ్వర్ మరింత కక్ష పెంచుకున్నాడు. మరోవైపు రెండు కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలో గొడవ ఉంది. అన్నదమ్ములైన రాములు, మల్లేష్‌కు ఉమ్మడిగా ఉన్న వ్యవసాయ భూమిలో వివాదం చోటుచేసుకుంది. ఇలా 15 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య పగ రగులుతూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం మల్లేష్ ఇంట్లో ఉండగా అతడిపై ఈశ్వర్, అతడి కుమారుడు తిరుమల్, అత్త పట్టి వెంకటమ్మ (రాములు భార్య) దాడి చేశారు. కర్రలతో చితకబాదడంతో మల్లేష్, అతడి భార్య పోషక్క, కుమారుడు హరీశ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం మల్లేష్ మృతి చెందాడు. అతడి భార్య పోషక్క, కుమారుడు హరీశ్ పరిస్థితి విషమంగానే ఉంది. మృతుడి బావమరిది లింగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.