byసూర్య | Wed, Oct 30, 2024, 10:45 PM
దీపావళి పండగ సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచుతూ రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ పెంచిన డీఏ.. 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తించనుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెరిగిన డీఏ నవంబర్ జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనుంది ప్రభుత్వం. మరోవైపు.. 2022 జులై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న పెడింగ్ డీఏను కూడా.. జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది.
ఇదిలా ఉంటే.. 2025 మార్చిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల డీఏ బకాయిలు మాత్రం 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. అయితే జీపీఎఫ్ ఖాతాలు లేని కంటిజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో ఈ మొత్తం అందివ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఏ పెంపు, చెల్లింపుల గురించి గత కొంతకాలంగా చర్చలు నడుస్తుండగా.. బుధవారం (అక్టోబర్ 30న) రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా దీపావళి పండుగ రోజునే ఉద్యోగుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తుండటంతో.. ఉద్యోగులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే... డీఏ పెంచాలని కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇటీవలే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి తమ డిమాండ్లు వినిపించారు. ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. డీఏ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయంపై ఈ నెల 26న జరిగిన కేబినెట్ భేటీలో చర్చించగా.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో.. ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.