byసూర్య | Wed, Oct 30, 2024, 11:01 PM
ఒకప్పుడు చాలా మంది బీటెక్ విద్యార్థులు మెకానికల్, సివిల్ బ్రాంచీలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందరిచూపూ సీఎస్‌ఈపైనే. కష్టమైన పని అంటూ మెకానికల్, సివిల్ ప్రవేశాలకు విద్యార్థులు దూరం అవుతున్నారు. కార్లు ఉత్పత్తి చేసే ఆటోమొబైల్ కంపెనీ.. నిపుణులైన మెకానికల్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నా లభించని దుస్థితి ఏర్పడింది. కోర్ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు ప్రతి ఏడాది తగ్గిపోవడం, నిపుణులైన అభ్యర్థులు లభించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 2020 నుంచి తెలంగాణలో కోర్ ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కంటే ఎక్కువ తగ్గుదల నమోదైంది. దీంతో ఈ ప్రభావం ఫ్యాకల్టీపై పడుతోంది. వారిని కష్టాల్లోకి నెట్టేసింది.
సీనియర్ ప్రొఫెసర్ల నుంచి నాలుగేళ్ల క్రితం అధ్యాపక వృత్తిలోకి వచ్చిన చాలా మంది ఇప్పుడు డెలివరీ బాయ్స్‌గా మారుతున్నారు. ఫుడ్ డెలివరీ, రోడ్లు పక్కన మిర్చి బజ్జీ స్టాళ్లు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. సివిల్, మెకానికల్ అధ్యాపకులకు నెలవారీ జీతాలు రూ. 40 వేల -రూ. 1.5 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు వారే రోజుకు రూ.500-రూ.700 కోసం పని చేస్తున్నారు. కొందరు ఫ్రీలాన్స్ టీచర్లుగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కొందరైతే రెండేళ్లుగా నిరుద్యోగులుగానే కొనసాగుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 86,943 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి, వీటిని EAPCET ద్వారా భర్తీ చేస్తారు. వీరిలో 61,587 మంది కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ బ్రాంచీల్లో చేరుతున్నారు. సివిల్, మెకానికల్ దాని అనుబంధ బ్రాంచీల్లో 7,458 సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ వాటా కేవలం 4,751 సీట్లు మాత్రమే. దీంతో కోర్ ఇంజనీరింగ్‌లో సీట్లు ఉన్నప్పటికీ.. ప్రతి ఏదాది దాదాపు 25 శాతం ఖాళీగా ఉంటాయి.
2020-2024 మధ్యకాలంలో, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ నుంచి AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు బీటెక్ విద్యార్థులు మారిపోయారు. దీంతో తెలంగాణలోని 175 బీటెక్ కళాశాలలు తమ కోర్ ఇంజనీరింగ్ సీట్లను 50 శాతానికిపై పైగా తగ్గించుకున్నాయి. దీంతో ఆయా కాలేజీల్లోని అధ్యాపకుల్లో కొందర్ని తొలగించగా.. బతుకుదెరువు కోసం కష్టపడుతూ కూలీ పనులు చేసుకుంటున్నారు.
'మొదట్లో నా వేతనం దాదాపు రూ.40 వేలు ఉండేది. ఆ తర్వాత రూ. 20 వేలకు తగ్గించారు. మళ్లీ మరో రూ.10 వేలు తగ్గిస్తానని చెప్పారు. నెలకు రూ.10 వేలతో నా కుటుంబాన్ని పోషించేది ఎలా? నాకు ఇద్దరు పిల్లలు వారు 7, 8వ తరగతి చదువుతున్నారు. వారికి స్కూల్ ఫీజులు కట్టాలి కదా. అందుకే ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నా. ఇప్పుడు రోజుకు రూ.600 వరకు సంపాదిస్తున్నా. సమయం దొరికితే ర్యాపిడో డ్రైవర్‌గానూ పని చేస్తూ అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా.' అని నగర శివారులోని ఓ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ బోధించే అధ్యాపకుడు వెల్లడించాడు. చాలా మంది పరిస్థితి తనలాగే ఉందని అన్నారు.
కాగా, ఈ పరిస్థితిపై అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నామని.. కోర్సులకు డిమాండ్ తగ్గటంతో తమ జీవనోపాధికి గండి పడిందని వాపోతున్నారు. చాలా ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో కొనసాగిన తాము ఇప్పుడు కూలీ పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.