byసూర్య | Wed, Sep 20, 2023, 01:01 PM
పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు కెప్టెన్ జలగం రామారావు (94) మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు సోదరుడైన రామారావు చెన్నైలోని గిండి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం 1952లో భారత నౌకాదళంలో చేరారు. 1975లో కెప్టెన్ స్థాయిలో ఉద్యోగ విరమణ పొందారు. ఇరవై ఏళ్లు పారిశ్రామిక రంగంలో నిమగ్నమయ్యారు. 1995 నుంచి సామాజిక, పర్యావరణ ఉద్యమాలలో మమేకం అవుతూ అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. సీనియర్ ఐఏఎస్ వసంతకుమార్‌తో కలిసి ‘సొసైటీ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్’ను ఏర్పాటు చేశారు. ‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ వ్యవస్థాపకులలో ఒకరిగా సేవలు అందించారు. కాగా, కెప్టెన్ జలగం రామారావు అంత్యక్రియలు బుధవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.