byసూర్య | Wed, Aug 10, 2022, 09:26 PM
తెలంగాణ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరుతున్నానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే బీజేపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. మంగళవారం అంకిరెడ్డిగూడెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అయిన రాజగోపాల్‌రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ప్రజల తీర్పు తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీజేపీ దేశ భద్రత, భవిష్యత్తు, సమైక్యత గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నారు. తన రాజీనామా గురించి గుత్తా సుఖేందర్‌రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహించిన రాజగోపాల్‌రెడ్డి.. ఆయన కాంగ్రెస్‌లో గెలిచి పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్‌లో చేరిన విషయం మరిచిపోకూడదన్నారు. కానీ తాను మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలో చేరుతున్నానని గుర్తుచేశారు. తాను స్వార్థం చూసుకుంటే పదవికి రాజీనామా చేసేవాడిని కాదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.