భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి

byసూర్య | Sat, May 04, 2024, 08:38 PM

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మండే ఎండలతో మాడు పగిలిపోతుంది. బయటికెళ్తే చాలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వివిధ జిల్లాల్లో 46.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. భానుడి ఉగ్రరూపం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం అవతుంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బసోకి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారు.


శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్‌ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలలో 46.7 డిగ్రీలు నమోదైంది. ఆసిఫాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన గోలి శ్రీధర్‌, వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిన రైతు అజ్మీర మంగ్యనాయక్‌, వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్‌(55) ఎండదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారానికి చెందిన రైతు యెల్లంల నర్సిరెడ్డి (63), పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంటకు చెందిన గాండ్ల లింగయ్య (70) నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన గుండ్లపెల్లి పెద్దవెంకన్న(58) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 6, 7 తేదీల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. శని, ఆదివారాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు అలాగే కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు ఉందని హెచ్చరించింది. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.


Latest News
 

జ్యోతి యాత్రలో పాల్గొన్న కొత్తకోట కాంగ్రెస్ నాయకులు Sat, May 18, 2024, 04:14 PM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 04:12 PM
స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాలని వినతి Sat, May 18, 2024, 04:11 PM
జూరాలకు చేరిన కర్ణాటక నీళ్ళు Sat, May 18, 2024, 04:10 PM
బీఆర్ఎస్ పార్టీ బీమా చెక్ అందజేత..! Sat, May 18, 2024, 04:08 PM