byసూర్య | Wed, Oct 30, 2024, 07:27 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సింగిల్ హ్యాండ్‌తో అధికారంలోకి తీసుకురావటాన్ని చూసి హైకమాండ్.. ఆయనకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అప్పటినుంచి తనదైన స్టైల్‌లో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. అటు తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇటు హైకమాండ్‌కు విధేయుడిగా ఉంటుండటంతో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఆయనకే అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్ఠానం. అయితే.. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది క్యాంపెయినర్లు ప్రచారాలు నిర్వహించినా.. రేవంత్ రెడ్డే సింగిల్ స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీని గెలిపించే బాధ్యతను తనొక్కడి భుజాలపై వేసుకుని.. విజయవంతమయ్యారు. దీంతో.. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా రేవంత్ రెడ్డిని లక్కీ ఛార్మ్‌గా భావించిన ప్రచార బాధ్యతలు అప్పగిస్తోంది అధిష్ఠానం.
ఈ క్రమంలోనే.. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లను నియమిస్తూ.. బుధవారం (అక్టోబర్ 30న) రోజున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కుమారి సెల్జా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో ఉన్న లిస్టును ఎన్నికల సంఘానికి పంపించింది. ఈ లిస్టులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండటం విశేషం.
ఈ లిస్టు చూసిన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదీ రేవంత్ రెడ్డి రేంజ్ అని.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడ రేవంత్ రెడ్డి గొంతు వినపడాల్సిందేనని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం వస్తుందని.. ఆయన ప్రచారం చేసిండంటే అక్కడ విజయం ఖాయమంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌కు మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 13, 20 తేదీల్లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కూడా కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేలా అధిష్ఠానం ప్లాన్లు వేస్తోందని తెలుస్తోంది.