byసూర్య | Sat, Jun 22, 2024, 07:30 PM
తెలంగాణ అన్నదాతలకు మనసు నిమ్మలమయ్యే వార్తను నిన్న (జూన్ 21న) సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ ఇచ్చేందుకు నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇందుకు కటాఫ్ తేదీని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు శాఖకు సంబంధించిన అధికారులంతా.. నిధుల సమీకరణ, అర్హుల గుర్తింపు, రుణమాఫీ విధివిధానాల రూపకల్పనపై కసరత్తు మొదలు పెట్టారు.
అయితే.. ఈ రుణమాఫీని ఆగస్ట్ 15వ తేదీ లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పదే పదే ఉద్ఘాటిస్తూ వచ్చారు. కేబినెట్ నిర్ణయమైతే తీసుకుంది కానీ.. మరి రుణమాఫీ ప్రక్రియను ఎప్పుటి నుంచి ప్రారంభిస్తారన్న సందేహాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అలాగే వదిలేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో.. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం రోజున.. ఖమ్మంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే నెల (జూలై) నుంచి రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రైతులకు రెండు లక్షల పంట రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా.. రూ.31 వేల కోట్ల రైతుల రుణాలు ఉన్నట్టు పేర్కొన్న మంత్రి పొంగులేటి.. వాటన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు.
పేదలకు ఇచ్చిన హామీల అమలుపై వెనకడుగు వేసేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. జూలై నుంచి రుణమాఫీ అమలు ప్రక్రియను మొదలు పెట్టి.. ఆగస్టు 15 లోపు అంటే కేవలం నెలన్నరలో మొత్తం రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.