నా ఇల్లు కట్టేందుకు మేస్త్రీ 60 వేలు అడిగాడు: రేవంత్ రెడ్డి

byసూర్య | Tue, Jun 18, 2024, 07:31 PM

తన సొంత ఇల్లు కట్టడానికి సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కంటే మేస్త్రి ఎక్కువ డబ్బులు అడిగాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే మేస్త్రీ ఎక్కువ డబ్బులు అడగడమేంటో తనకు అర్థంకాలేదన్నారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచడం లేదని తనకు అప్పుడే అర్థమైందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఐటీఐలను ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందుకే, ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలనే నిర్ణయించామని సీఎం వెల్లడించారు. మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం (జూన్ 18) శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారని, వారి విలువైన కాలాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.


ఏటా ఎంతో మంది ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడే అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించి, ఎవరూ విదేశాలకు వెళ్లకుండా చేస్తామని ఆయన అన్నారు. ‘నా ఇల్లు కడుతున్నపుడు సైట్ సూపర్ వైజర్ కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు నెలకు రూ.15 వేలు, రూ. 20 వేలకు మాకు ఇవ్వండి. మేం చేస్తాం అన్నారు. అదే ఇళ్లు కట్టడంలో అనుభవం ఉన్న మేస్త్రి నెలకు రూ. 60,000 అడిగాడు’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రోబోలు సహా అత్యాధునిక యంత్రాలను తీసుకొచ్చి యువతకు శిక్షణ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రయత్నంలో తోడ్పడేందుకు టాటా సంస్థ ముందుకొచ్చిందని వెల్లడించారు. ‘రాష్ట్రం నలుమూలలా 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాం. ముఖ్యమంత్రిగా నేను ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారిస్తా. ప్రతి నెలా సమీక్ష చేస్తా’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.


తెలంగాణ రాష్ట్రంలోని ఐటీఐలన్నింటినీ ఆధునికీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రూ.2,324.21 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ అప్‌గ్రేడ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా మార్చనున్నారు. ఇందుకోసం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.307.96 కోట్లు భరిస్తుండగా.. టీటీఎల్‌ రూ. 2016.25 కోట్లు భరించనుంది. ఏటీసీల్లో శిక్షణ పొందిన యువతీ యువకులకు టీటీఎల్‌ ఉద్యోగాలు కల్పించనుంది.


‘ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతకు ఏటీసీల్లో శిక్షణ ఇస్తాం. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించాం. అధునాతన యంత్రాలు, సాంకేతికత ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏటా 15,860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ లభించనుంది. అదేవిధంగా 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్‌ టర్మ్‌ కోచింగ్ లభిస్తుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.



Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM