రూ.2.10 కోట్ల గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దూకుడు.. ఇద్దరు కీలక అధికారులు అరెస్ట్

byసూర్య | Fri, May 31, 2024, 07:27 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న యాంటీ కరెప్షన్ బ్యూరో - ఏసీబీ.. తాజాగా మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది. ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా రూ.2.10 కోట్ల అవినీతి జరిగిందని రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నలుగురు ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వారి నుంచి సేకరించిన సమాచారంతో మరింత లోతైన దర్యాప్తు జరిపిన ఏసీబీ.. తాజాగా మరో ఇద్దరు కీలక అధికారులను పట్టుకుంది.


గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. తెలంగాణ పశుసంవర్ధకశాఖ సీఈఓ సబావత్‌ రామ్‌చందర్‌‌తోపాటు ఓఎస్‌డీ కళ్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్ చేశారు. రూ.2.10 కోట్ల గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రామ్‌చందర్, కళ్యాణ్‌ కుమార్ నిందితులుగా ఉన్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామ్‌చందర్, కళ్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిద్దరినీ కోర్టులో హజరు పరిచారు.


ఇక ఫిబ్రవరిలో నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి.. మేడ్చల్‌ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ గణేష్‌‌లను అరెస్ట్ చేసి.. కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించింది. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడి.. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి పథకం నిధులను తరలించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.


2017 జూన్ 20 వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 12 వేల కోట్ల బడ్జెట్‌తో ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో ఈ పథకాన్ని మొదలు పెట్టారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలకు గాను రూ. 1,25,000 ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను రూ.1,75,000కు పెంచారు. ఇందులో రూ. 1,31,250ను రాష్ట్ర ప్రభుత్వం భరించగా.. రూ. 43,750ను లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


Latest News
 

సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే Sun, Oct 20, 2024, 02:06 PM
బిటి రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు Sun, Oct 20, 2024, 01:50 PM
గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి Sun, Oct 20, 2024, 01:49 PM
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి Sun, Oct 20, 2024, 01:40 PM
నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత Sun, Oct 20, 2024, 12:27 PM