హైదరాబాద్‌లో కొత్త రైల్వే స్టేషన్.. త్వరలోనే ప్రారంభం, వీరికి గుడ్‌న్యూస్

byసూర్య | Tue, Apr 16, 2024, 07:26 PM

హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ స్టేషన్ల నుంచే ట్రైన్లు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో మరో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయింది. నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఈ స్టేషన్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 5 ప్లాట్‌ఫాంలతో పాటు.. రైళ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌ భవనంలోనే టిక్కెట్‌ కౌంటర్లు, కార్యాలయం సిద్ధం చేశారు. స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది.


ఇక్కడి నుంచి తొలుత 6 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు నడపనుండగా.. ఆ తర్వాత 25 జతల దూరప్రాంత ట్రైన్లను నడపడానికి స్టేషన్‌ను సిద్ధం చేస్తున్నారు. రూ.430 కోట్లకు పైగా వెచ్చించి ఈ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతుండగా.. ఇప్పటికే 24 రైల్వే బోగీలు పట్టే విధంగా 5 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు రానుండగా.. 6 మీటర్ల వెడల్పుతో మరొకటి కూడా రెడీ అవుతోంది. 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కోచ్‌ నిర్వహణ వ్యవస్థతో పాటు.. ఎంఎంటీఎస్‌ ట్రైన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా రెండు ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి.


ఈ స్టేషన్ నుంచి ట్రైన్లు అందుబాటులోకి వస్తే రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తో సంబంధం లేకుండా ట్రైన్ ప్రయాణాలు నేరుగా సాగనున్నాయి. భవిష్యత్తులో లింగంపల్లి తర్వాత హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్లు ఆగి సనత్‌నగర్‌ - మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునే వెసులుబాటు కలగనుంది. అలాగే విజయవాడ మీదుగా వచ్చే ట్రైన్లు కాచిగూడ స్టేషన్‌మీదుగా బెంగళూరు, కర్నూలువైపు వెళ్లే ట్రైన్లు కూడా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరకుండా వెళ్లడానికి వీలు కలగనుంది. సిటీలోకి రాకుండా 50 శాతం ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి బెంగళూరు వెళ్లే ట్రైన్లతో పాటు.. విశాఖపట్నం, విజయవాడ వెళ్లే ట్రైన్లను కూడా అక్కడి నుంచి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు.



Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM