byసూర్య | Wed, Oct 30, 2024, 07:19 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తన కుర్చీని కాపాడుకోవాలని... పక్కనున్న వాళ్లు తనను ఫినిష్ (రాజకీయంగా) చేయకుండా జాగ్రత్తపడాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. తనను దించేయకుండా ఆయన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్నారు.మల్లన్న సాగర్ నిర్వాసితుల కాలనీని చూస్తే రాజమౌళి సినిమాను తలపిస్తుందన్నారు. మూసీ పరీవాహక బాధితులకు మల్లన్న సాగర్ బాధితులకు మించిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి భూముల్లో ఇళ్లు కట్టివ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు పాదయాత్రకు సిద్ధమని, హైదరాబాద్ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దామని, అయితే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రావాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ పెట్టిన భిక్షతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తమను డీల్ చేయడం పక్కన పెట్టి తన కుర్చీని కాపాడుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదైనా ఆరు మంత్రి పదవులు నింపలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు ఖాయమన్నారు.