చికెన్ బిర్యానీలో 'కప్ప'.. మసాలా పట్టించి మరీ ఉడికించారుగా

byసూర్య | Sun, Oct 20, 2024, 06:46 PM

చికెన్ బిర్యానీ అంటే.. హైదరాబాద్‌ వాసులకే కాదు చాలా మందికి ఓ ఎమోషన్. ఏ చిన్న సంతోషకరమైన సందర్భం వచ్చినా దాన్ని బిర్యానీతో సెలెబ్రెట్ చేసుకుంటుంటారు. మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా ఎన్ని ఉన్నా.. చాలా మందికి చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం. అయితే.. చికెన్ బిర్యానీ రుచికరంగా రావాలంటే.. సాధారణంగా చికెన్‌తో పాటు లవంగాలు, యాలాకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధద్రవ్యాలతో పాటు పుదీనా, కొత్తమీర వేసి.. పైనుంచి నెయ్యి వేస్తుంటారు. కానీ.. ఈ మధ్య మాత్రం జెర్రిలు, కప్పలు కూడా వేస్తున్నారు. ఇటీవలే.. తెలంగాణలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానీలో జెర్రి ఉడకిన ఘటన వెలుగు చూడగా.. ఇప్పుడు ఏకంగా కప్పను వేసి ఉడికించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అది ఏదో ఓ హోటల్‌లోనో, లేదా రెస్టారెంట్‌లోనో కాదు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీలోని ఓ మెస్‌లో. కాగా.. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


గచ్చిబౌలి ఐఐఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు బుధవారం (అక్టోబర్ 17న) రోజున బిర్యానీ పెట్టారు. అయితే.. ఓ విద్యార్థికి వడ్డించిన బిర్యానీలో చికెన్ పీస్‌తో పాటు కప్ప కూడా వచ్చింది. అది చూసి ఒక్కసారిగా విద్యార్థికి కడుపులోని పేగులు దేవేసినంత పనైంది. అయితే.. బిర్యానీ వండిన తర్వాత.. వడ్డించే గ్యాప్‌లో దారితప్పి వచ్చిన కప్ప అందులో పడిందనుకుందామా అంటే.. అది చనిపోయి పూర్తిగా ఉడికిపోయిన స్థితిలో మసాలాతో కనిపిస్తోంది. దీన్ని బట్టి ఆ కప్ప కూడా బిర్యానీతో పాటే ఉడికినట్టుగా తెలుస్తోంది. అంటే.. చికెన్‌తో పాటే ఆ కప్పను కూడా మసాలాతో కలిపి ధమ్ పెట్టినట్టుగా అర్థమవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


దీంతో.. విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో మొన్నటివరకు బొద్దింకనో, ఈగలో, దోమలో వచ్చాయంటే.. ఏదో కనిపించలేదేమో వచ్చాయని సర్థిచెప్పుకుంటే.. ఇప్పుడు ఏకంగా కప్పే దర్శనమివ్వటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇది కచ్చితంగా మెస్‌ నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనమే. బిర్యానీలో ఓ కప్పను ఉడికించారంటే ఎంత జాగ్రత్తగా భోజనాలు వండుతున్నారన్నది ఇట్టే తెలిసిపోతోంది.


ఇంత నిర్లక్ష్యంగా ఉన్న మెస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలతో.. విద్యార్థుల ఆరోగ్యాలు ఏమైపోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను తోటి విద్యార్థులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. మెస్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.


ఇప్పటికే కాలేజీలు, స్కూళ్లలోని మెస్‌లలో నాణ్యత పాటించట్లేదని.. నాసిరకమైన బియ్యం, పప్పులతో పాటు కుళ్లిపోయిన కూరగాయలతో భోజనాలు తయారు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు నిదర్శనంగా.. నిత్యం ఎక్కడో ఓ చోట విద్యార్థులు ఆనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నా ఘటనలు. కాగా.. ఇప్పుడు ఏకంగా బిర్యానీలో కప్ప ప్రత్యక్షమవటంతో.. సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM