ఇద్దరమే కారులో వెళ్దాం.. నేను నడుపుతా, నువ్వు పక్కన కూర్చో: సీఎం రేవంత్‌కు హరీష్ సవాల్

byసూర్య | Fri, Oct 18, 2024, 09:28 PM

మూసీ నది పునరుజ్జీవం పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిన్నటి సీఎం రేవంత్ ప్రెస్‌మీట్‌లో ఏఐ గ్రాఫిక్స్ హైరైజ్ బిల్డింగులు చూపించి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ వెనుక దాగి ఉన్న స్టంట్ ఏంటో తెలియాల్సి ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో నేడు ప్రెస్‌మీట్ నిర్వహించిన హరీష్.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.


మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌ నిర్మాణ సమయంలో అక్కడి ప్రజలను బలవంతంగా తరలించారన్న సీఎం రేవంత్‌ వ్యాఖ్యలను హరీష్ తప్పుబట్టారు. మూసీ నుంచి మల్లన్నసాగర్‌, రంగనాయక సాగర్‌కు వెళ్దామని సీఎంకు సవాల్‌ విసిరారు. స్వయంగా తానే కారు డ్రైవింగ్‌ చేస్తానని.. పక్కన కూర్చుంటే ఇద్దరం కలిసి అక్కడకు వెళ్దామని అన్నారు. 'సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. నేను డ్రైవ్ చేస్తా.. నువ్వు పక్కన కూర్చో. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్దం. ముందు మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం. అక్కడే కూర్చొని మాట్లాడుదాం.' అని హరీష్ సవాల్ విసిరారు.


మల్లన్న సాగర్, రంగనాయక సాగర్‌లో బాధితులుగా మిగిలిన వారికి రెండురెట్ల పరిహారంతో పాటు 250 గజాల ఇండ్లు మున్సిపాల్టీలో కట్టించామన్నారు. 18 ఏండ్లు నిండిన వారందరికీ ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ అందించామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల అంత ప్రేమ ఉంటే మిగిలిపోయిన వారికి ఆర్అండ్ఆర్ కోసం మరో రూ.200 కోట్లు అందించి సహాయం చేయాలన్నారు.


మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలతో అబద్దమే అశ్చర్య పోయిందని హరీష్ ఎద్దేవా చేశారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదన్న ఆయన.. తమ ప్రభుత్వ హయంలోనే 2,800 కోట్లతో 36 శుద్ది కేంద్రాలను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. గత సీఎం కేసీఆర్ హయాంలో మూసీలోకి రూ.1100 కోట్లతో గోదావరి జలాలను తరలించేందుకు డీపీఆర్ సైతం సిద్ధమైందన్నారు. తాము మూసీ పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదని.. పేదల ఇండ్లను కూల్చడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ పేర్లతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని హరీష్ విమర్శించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM