ఆమ్రపాలి స్థానంలో జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్ ఎవరు.. తెరపైకి ఇద్దరు మహిళా అధికారుల పేర్లు

byసూర్య | Wed, Oct 16, 2024, 07:30 PM

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లకుండా, తెలంగాణలోనే తమ విధులు కొనసాగించేలా ఐఏఎస్‌లు చేసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ సహా ఏడుగురు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్‌లను రిలీవ్ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ నలుగురు ఐఏఎస్‌లు తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ నలుగురు ఐఏఎస్‌లలో ఆమ్రపాలి కాటా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా కీలక బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. వాకాటి కరుణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, వాణీ ప్రసాద్ యువజన సర్వీసులు, టూరిజం, కల్చర్ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యదర్శిగా, రొనాల్డ్ రాస్.. విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీరి స్థానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరితో భర్తీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


ఈ నాలుగు స్థానాలు కీలకమైనవే కావడం గమనార్హం. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన వారిలో సీనియర్‌కు కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులు దాసరి హరిచందన, భారతి హోలికేరి పేర్లు పరిశీలన ఉన్నట్లు సమాచారం.


జలమండలి ఎండీగా పనిచేసిన అధికారులను కమిషనర్‌గా నియమించిన ఆనవాయితీ కూడా ఉంది. గతంలో వాటర్ బోర్డు ఎండీగా పనిచేసిన దానకిషోర్, జనార్ధన్ రెడ్డిలకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు దక్కాయి. అదే తరహాలో ఐఏఎస్ అశోక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇక మరో సీనియర్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు ఆ బాధ్యతలు కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు ఏపీ నుంచి ఐఏఎస్‌లు శివశంకర్, సృజన.. తెలంగాణ సెక్రటేరియట్‌కు వచ్చి బుధవారం (అక్టోబర్ 16) సాయంత్రం సీఎస్ శాంతికుమారికి రిపోర్టు చేశారు.


2013 డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్ర సర్వీసులో ఉన్న ఆమ్రపాలిని, కేంద్రానికి లేఖ రాసి తెలంగాణ రాష్ట్రానికి రప్పించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ పోస్టుతో పాటు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ప్రస్తుతం ఆమ్రపాలి ఏపీకి వెళ్తే.. ఆమె స్థానాన్ని అనుభవం ఉన్న, సమర్థమైన అధికారితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్ కోసం కసరత్తు చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అంతవరకూ హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు జీహెచ్‌ఎంసీ ఇంచార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ పోస్టును ప్రత్యేకంగా మరో సీనియర్ అధికారికి కేటాయించే అవకాశం ఉందని కొంత మంది అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఆమ్రపాలికి ఏపీలో ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది అక్కడ మరో చర్చకు కారణమైంది.



Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM