వారికి బ్యాంకు లోన్లు ఇవ్వొద్దు.. హైడ్రా సంచలన ఆదేశాలు

byసూర్య | Tue, Sep 24, 2024, 08:51 PM

హైదరాబాద్‌లో చెరువులు, కుంటల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా బుల్డోజర్లు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. అక్రమ కట్టడాలు నిర్మించింది సామాన్యులా.. సెలెబ్రిటీలా.. రాజకీయ నాయకులా అన్నది ఏమాత్రం పట్టించుకోకుండా.. అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా.. బఫర్ జోన్ కిందికి వస్తుందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతల ఆపరేషన్ జోరందుకుంది. ఇటీవలే.. కూకట్ పల్లి, అమీన్ పూర్ ఏరియాల్లో కూడా కూల్చివేతలు చేపట్టగా.. అందులో చాలా వరకు సామాన్యులకు సంబంధించిన నిర్మాణాలే ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.


అయితే.. హైడ్రా కూల్చేసిన ఇండ్లు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని మరీ కట్టుకున్నామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారం రోజుల కిందే గృహప్రవేశం చేశామని.. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ అయ్యిందని.. ఇలా బాధితులు తమ గోడును మీడియా ముందు వెళ్లబోసుకుంటున్నారు. బాధితులు చెప్తున్న బ్యాంకు లోన్ల విషయాన్ని పరిగణలోకి తీసుకున్న హైడ్రా.. బ్యాంకులకు సంచలన ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.


అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా నిరోధించేందుకు హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. ఈ సమావేశంలో బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలను నిరోధించేందుకు రంగనాథ్‌ బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.


అంతే కాకుండా.. ఇటీవల కూల్చివేసిన భవనాలు, విల్లాలకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్టు సమాచారం. జలాశయాల సమీపంలోని నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంపై ఏవీ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువుతో పాటు మరో రెండు ప్రాంతాల్లో కలిపి 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించారు. ఈ క్రమంలో.. తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేశారంటూ బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము.. లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM