![]() |
![]() |
byసూర్య | Thu, Jul 25, 2024, 07:52 PM
రంగారెడ్ది జిల్లా మహేశ్వరంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందున్న ఓ హోటల్‌లో చోరీ చేసేందుకు ఓ దొంగ పకడ్బందీగా సిద్ధమయ్యాడు. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. ఫింగర్ ప్రింట్స్ పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు. సీసీకెమెరాల్లో తన ముఖం కనపడకుండా స్కార్ఫ్ కట్టుకున్నాడు. ఓ రాడ్ తీసుకుని సీరియస్‌గా తాళం బద్దలుకొట్టి లోపలికి ఎంటరయ్యాడు. పెద్ద హోటల్ కావటంతో.. ఈరోజు గట్టిగానే గిట్టుబాటు అవుతుందనుకున్నాడు. కానీ.. తన ఆశలన్ని అడియాశలయ్యాయి. హోటలంతా వెతికినా.. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా దొరకలేదు.
ఎంతో ఊహించుకుని.. ఇంత కష్టపడి వస్తే.. ఏమీ దొరకకపోవటంతో.. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఆ దొంగ. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక.. హోటల్‌లో ఉన్న సీసీ కెమెరాలకు చూపించాడు. సీసీ కెమెరాల ముందు వ్యక్తం చేసిన ఆ దొంగ అసహనాన్ని చూస్తే.. సినిమాల్లో కమెడియన్లు గుర్తుకురావటం ఖాయం. బ్రహ్మానందం, ఆలీ, షకలక శంకర్, సప్తగిరి.. ఇలా పలువురు కమేడియన్లు దొంగ క్యారెక్టర్లలో నవ్వులు పూయించగా.. ఈ దొంగ వాళ్లను మించి నవ్వించాడు.
హోటల్ యాజమాని ఒక్క రూపాయి కూడా పెట్టకపోగా.. పైగా చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడని భావించాడో.. ఇంత కష్టపడి వస్తే ఇలా జరిగిందేంటని చిరాకు పడ్డాడో కానీ.. దూకుడు సినిమాలో కెమెరా ముందుకొచ్చి బ్రహ్మానందం రిక్వెస్ట్ చేసినట్టుగా.. తన ఫ్రస్ట్రేషన్ చూపించాడు. తనలోని ఫ్రస్ట్రెషన్‌ను సైగల రూపంలో చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇంత పెద్ద హోటల్లో పదో పరకో పెట్టుకపోతే తనలాంటి దొంగలు ఎలా బతికేదని వేడుకున్నాడో.. లేక మీవేం బతుకులురా సామీ.. ఒక్క రూపాయి అయిన పెట్టకపోతే ఎలా..? అన్నాడో.. సీసీ కెమెరా ముందు మాత్రం ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు.
హోటల్ మొత్తం వెతికిన ఏమీ దొరక్కపోవడంతో.. పక్కనే ఉన్న ఫ్రీడ్జ్ తీసి చూస్తే.. అందులో కూడా ఏమీ లేవు వాటర్ బాటిల్స్ తప్ప. దొంగతనానికి వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకెళ్దామని ఓ వాటర్ బాటిల్ పట్టుకెళ్లాడు. ఇంత బతుకు బతికి కేవలం 20 రూపాయల వాటర్ బాటిల్ దొంగిలించిన పేరు తనకెందుకు అనుకున్నాడో ఏమో.. తిరిగి వచ్చి తన పర్సులో నుంచి 20 రూపాయలు నోటు తీసి టేబుల్‌పై పెట్టాడు. ఇదిగో నీ వాటర్ బాటిల్ డబ్బులు అన్నట్టుగా సీసీ కెమెరాకు చూపించి టేబుల్ మీద పెట్టి.. నిరాశగా వెళ్లిపోయాడు ఆ దొంగ.
అయితే.. తర్వాత రోజు వచ్చిన ఆ హోటల్ యజమాని ఈ సీసీ టీవీ దృశ్యాలను చూసి.. కోపానికి రావటం మానేసి.. నవ్వుకోవటం ప్రారంభించాడు. అతనితో పాటు ఆయన కుటుంబం కూడా ఆ దొంగ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి రన్నింగ్ కామెంట్రీ ఇచ్చుకుంటూ తెగ నవ్వుకున్నారు. కాగా.. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. నీకు వచ్చిన కష్టం పగోనికి కూడా రావొద్దు అంటూ కొందరు నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.