రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి

byసూర్య | Mon, Sep 16, 2024, 10:05 PM

రాష్ట్రాన్ని 9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్ నేతలకు తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సోమవారం (సెప్టెంబర్ 16) సాయంత్రం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై ఘాటు విమర్శలు చేశారు. డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.


18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల వల్లే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయులు ఐటీ సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రాజీవ్ గాంధీ లేకపోయుంటే, గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకుంటూ తిరిగెటోడివి. గుంటూరులో చదువుకున్న అని చెప్పినవ్ కదా. లేకపోతే, సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోడివి. నీకు కంప్యూటర్, ఐటీ జాబ్, ఐటీ మంత్రి పదవి వచ్చాయంటే.. అది రాజీవ్ గాంధీ ఘనతే’ అని రేవంత్ రెడ్డి అన్నారు.


దేశ ప్రజల కోసమే రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాజీవ్‌ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఏ పదవీ తీసుకోలేదని గుర్తుచేశారు. ‘పదవీ త్యాగం అంటే వాళ్లవి. తెలంగాణ బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా గాంధీ కాదా? గాంధీ కుటుంబం గురించి కేసీఆర్‌ కుటుంబానికి తెలుసా? అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? మీ ఫాంహౌస్‌లలో జిల్లేళ్లు మొలిపిస్తా. ఎవడొస్తాడ్రా.. రండి.. తారీఖు చెప్పండి బిడ్డా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించారని చెప్పారు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చారని కొనియాడారు. వేల కోట్ల రూపాయల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి, స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచిన నాయకుడు నెహ్రూ అని రేవంత్ రెడ్డి అన్నారు. నెహ్రూ నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని కొనియాడారు.


‘నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదు. కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందారు’ అంటూ కేటీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, సీతక్క, కొండా సురేఖ, రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వి. హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM