గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి

byసూర్య | Wed, Sep 18, 2024, 10:11 PM

తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి. 11 రోజుల పాటు మండపాల్లో పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. అయితే నిమజ్జనాల్లో పలుచోట్ల అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. గణపయ్యను గంగ ఒడికి తరలించే క్రమంలో పలువురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో తండ్రిని కాపాడబోయి ఓ కూతురు మృత్యుఒడికి చేరింది. లారీ టైర్ల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. నారాయణగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచిగూడ, నింబోలిఅడ్డాకు చెందిన మహేందర్‌ ఎల్బీనగర్‌ సమీపంలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 15న రాత్రి కాలనీలో ప్రతిష్ఠించిన గణేషుడిని నిమజ్జనానికి తరలించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి పెద్ద వాహనంలో గణేషుడిని తరలించారు.


లారీపై మహేందర్, ఆయన కుమార్తె పూజిత (17) కూర్చుని నిమజ్జనానికి బయల్దేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిమజ్జనం వాహనం హిమాయత్‌నగర్‌ వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో కదులుతున్న వాహనం నుంచి మహేందర్‌ కిందకు దిగుతూ అదుపు తప్పి పడిపోయారు. తన తండ్రి లారీ టైర్ల కింద పడిపోతారని భయపడిన పూజిత.. ఒక్కసారిగా లారీ నుంచి దూకేసింది. ఈ క్రమంలో ఆమె లారీ వెనుక చక్రాల కిందపడి నలిగిపోయింది. గమనించిన స్థానికులు పూజితను బయటకు లాగి వెంటనే నిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఆమె.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.


గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ గణపతి.. అపురూప దృశ్యాలు


ఇక మరో ఘటనలో వినాయకుడి నిమజ్జనానికి చెరువులోకి దిగి ఈత రాక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పబ్బుగాని ప్రవీణ్‌ యాదవ్‌ (27) హైదరాబాద్‌లో సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. గణేష్ నిమజ్జనానికి వచ్చిన ప్రవీణ్.. నిమజ్జనానికి చెరువులో దిగి ఈత రాకపోవటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో అతడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించటం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.


చింతపల్లి మండల పరిధిలోనూ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రిజర్వాయర్ కోసం తీసిన నీటి గుంతలో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి జంటతండాకు చెందిన జెర్పుల రామ్‌కోఠి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటి వరకు ఆనందంగా తమ కళ్లముందు నృత్యం చేసిన రామ్‌కోఠి విగతజీవిగా మారడంతో తండా వాసులంతా కన్నీటిపర్యంతమయ్యారు.


Latest News
 

వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM
ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్‌ల కొరత Thu, Sep 19, 2024, 07:58 PM