byసూర్య | Fri, Jul 12, 2024, 07:27 PM
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధా కిషన్, తిరుపతన్న, ప్రణీత్ రావులకు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు మరోసారి పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఈ నలుగురుని పోలీసులు అరెస్టు చేసి వంద రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో.. నిందితులు డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. నలుగురిని నిందితులుగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేయగా.. రిమాండ్ ఖైదీలుగా 100 రోజులకు పైగానే జైలులో ఉంటున్నారు. అయితే.. గతంలోనూ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా.. అరెస్ట్ చేసి 100 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఛార్జిషీట్ దాఖలు చేయలేకపోయారంటూ నిందితుల తరుపు న్యాయవాదులు వాదించారు.
మరోవైపు.. ఛార్జిషీట్ వెనక్కి ఇచ్చినంత మాత్రాన వేయనట్టు కాదని పోలీసుల తరుపు న్యాయవాది వాదించారు. విచారణ కీలక దశలో ఉందని.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. నలుగురు నిందితులకు బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. కాగా.. ఈ కేసులో ప్రణీత్ రావు ఏ2గా, తిరుపతన్న ఏ3గా, భుజంగరావు ఏ4గా, రాధాకిషన్ రావు ఏ5గా ఉన్నారు.
పోలీసులకు ప్రభాకర్ రావు లేఖ..
ఇదిలా ఉంటే.. ఈ కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. తాను వాస్తవానికి జూన్ 26వ తేదీన భారత్‌కు రావాల్సి ఉందని.. కానీ అనారోగ్యం కారణంగా అమెరికాలోనే ఉండిపోయానని చెప్పుకొచ్చారు. తాను క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అమెరికా వైద్యుల సూచన మేరకు అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రభాకర్ రావు తెలిపారు. తనపై పూర్తి అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు చేయలేదని చెప్పుకొచ్చారు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను ఇండియాకు వచ్చే వరకూ టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
తాను క్రమశిక్షణ గల ఒక పోలీసు అధికారినని.. విచారణను ఎదుర్కొంటానని ప్రభాకర్ రావు తెలిపారు. తాను ఎక్కడికీ తప్పించుకొని పోనని.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తానే ఇండియాకు వస్తానని చెప్పుకొచ్చారు. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్సప్ కాల్ ద్వారా చెప్పానని గుర్తు చేశారు. తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నంటూ లేఖలో పేర్కొన్నారు.