byసూర్య | Wed, Jun 26, 2024, 08:30 PM
బంగ్లాదేశ్ యువతి చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి కన్న కొడిక్కి దూరమయ్యాడు. గత ఏడాదిన్నరగా కుమారుడి కోసం తల్లడిల్లిపోతున్నాడు. బంగ్లాదేశ్‌లో భాష తెలియక, తల్లి పెట్టే చిత్ర హింసలకు తట్టుకోలేకపోతున్న తన ఐదేళ్ల కుమారుడిని తన వద్దకు చేర్చాలని వేడుకుంటున్నాడు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి తన గోడును వెల్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగన్నపల్లికి చెందిన మాగాని తిరుపతయ్య గృహనిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. 2016లో ఉపాధి నిమిత్తం ముంబై వెళ్లాడు. అక్కడ తాను పని చేసే చోట తోటి కార్మికురాలు రియాతో తిరుపతయ్యకు పరిచయమైంది. ప్రేమగా మారి ఇద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. తాను స్థానికురాలినే అని నమ్మించి రియా తిరుపతయ్యను పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత వారికి విశాల్ అనే బాబు జన్మించాడు. అయితే కొంత కాలానికి ఆమె ఇండియన్ కాదని.. బంగ్లాదేశ్‌కు చెందిన యువతి అని తెలిసింది. అయినా తాను తిరుపతయ్యతోనే ఉంటానని నమ్మించింది. కరోనా సమయంలో తిరుపతయ్య స్వగ్రామానికి రాగా.. ముంబైలో ఉన్న రియా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని బంగ్లాదేశ్ వెళ్లిపోతున్నానని బాబును తీసుకెళ్లాలని తిరుపతయ్యకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో తిరుపతయ్య చేసేదేం లేక ముంబై వెళ్లి బాబును తీసుకొచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ బాలాపూర్ మాకాం మార్చిన తిరుపతయ్య అక్కడే బాబును స్కూళ్లో చేర్పించాడు.
కొద్ది కాలానికి అంటే.. 2022లో రియా మరోసారి తిరుపతయ్యకు ఫోన్ చేసింది. తాను ముంబై వచ్చానని ఒక్కసారి బాబును చూపించాలని కోరింది. దీంతో తిరుపతయ్య విశాల్‌ను ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ రియా తన బంధువులతో కలిసి తిరుపతయ్యపై దాడి చేసి బాబును బంగ్లాదేశ్ తీసుకెళ్లింది. అప్పటి నుంచి తిరుపతయ్య తన కుమారుడి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. రియా చెల్లెలి భర్త ద్వారా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాడు. అందకు అతడు డబ్బులు డిమాండ్ చేయగా.. పలు విడతల్లో రూ.4 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఓసారి బంగ్లాదేశ్ సరిహద్దుల వరకు కూడా వెళ్లొచ్చాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.
అక్కడ తన కుమారుడు భాష తెలియక ఇబ్బందులు పడుతున్నాడని... తల్లి రియా ఆమె బంధువులు బాబును చిత్రహింసలకు గురి చేస్తున్నారని తిరుపతయ్య వాపోతున్నాడు. ఎలాగైనా తన కుమారుడిని ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నాడు. ఈ మేరకు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు.