మీరు పెట్టిన భిక్ష.. కరీంనగర్‌ నేలను తాకి, ప్రణమిల్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్

byసూర్య | Wed, Jun 19, 2024, 07:37 PM

తన పదవిని, హోదాను కార్యకర్తలకే అంకితం చేస్తున్నానని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ప్రకటించారు. కమిట్‌మెంట్‌తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టే కేంద్రం తనను గుర్తించిందని ఆయన అన్నారు. కార్యకర్తలు 152 రోజులు తమ కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామ యాత్రతో తన వెంట నడిచారని ఆయన గుర్తుచేశారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి బుధవారం (జూన్ 19) తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చిన బండి సంజయ్‌కు కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ గడ్డ మీద అడుగు పెట్టిన వెంటనే.. నేలను తాకి, సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు బండి సంజయ్ కుమార్. తాను ఏ స్థాయికి ఎదిగినా, అది కరీంనగర్ ప్రజల పెట్టిన భిక్షేనని ఆయన అన్నారు.


కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని బండి సంజయ్ చెప్పారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, అన్ని పార్టీల నేతలను కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ‘సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే దానికి కారణం బీజేపీ పార్టీ, కార్యకర్తల కష్టార్జితమే’ అని బండి సంజయ్ అన్నారు.


కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి కిషన్ రెడ్డి రేపు ఉదయం తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పిన బండి సంజయ్.. ఆయనకు ఘనంగా స్వాగతం పలుకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు సెల్యూట్’ పేరుతో మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతామని ఆయన తెలిపారు.


కరీంనగర్ లోక్ సభ నియోజరవర్గ పరిధిలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని బండి సంజయ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు బండి సంజయ్‌. ఈ నెల 8న ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్‌పై స్థానికులు తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.



Latest News
 

PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM
బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీఎస్పీ Mon, Oct 28, 2024, 02:22 PM
క్వారీలో దూకి యువకుడి ఆత్మహత్య Mon, Oct 28, 2024, 02:21 PM
అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న కోటి Mon, Oct 28, 2024, 01:55 PM
సదర్ సమ్మేళనం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం Mon, Oct 28, 2024, 01:36 PM