విద్యార్థుల తల్లిదండ్రులకు రిలీఫ్.. హైదరాబాద్ డీఈవో కీలక ఆదేశాలు

byసూర్య | Fri, May 31, 2024, 07:48 PM

పిల్లల స్కూలు ఫీజు నానాటికీ పెరిగిపోతోంది. కొన్నేళ్ల కిందట ఇంజినీరింగ్, ఎంబీఏ కోర్సులు చదివించేందుకు మధ్యతరగతి తల్లిదండ్రులు చెల్లించిన ఫీజుల మొత్తాన్ని ప్రస్తుతం ఎల్‌కేజీ, యూకేజీ చదువుల కోసమే పెట్టాల్సి వస్తోంది. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజులు అదనం. మధ్య మధ్యలో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్స్‌కు మరి కొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలలు కనే తల్లిదండ్రులకు ఇవన్నీ పెను భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రైవేట్ (అన్-ఎయిడెడ్) స్కూళ్లలో యూనిఫాం, షూస్ అమ్మడాన్ని నిషేధించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్‌కు మే 30న ఉత్తర్వులు జారీ చేశారు.


హైదరాబాద్ జిల్లా పరిధిలోని స్టేట్ సిలబస్, సీబీఎస్ఇ, ఐసీఎస్ఇ సిలబస్ బోధించే అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యూనిఫామ్, షూస్, బెల్ట్‌ల అమ్మకాలు జరగకుండా చూడాలని అధికారులను డీఈవో రోహిణి ఆదేశించారు. అయితే, స్టేషనరీ, పుస్తకాల లాంటి వాటిని మాత్రం ‘నో లాస్ - నో ప్రాఫిట్’ బేసిస్ మీద స్కూలు ఆవరణలో కౌంటర్ల ద్వారా అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు. ఇందులో లాభపేక్ష లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


ప్రైవేట్ స్కూళ్ల ఆవరణలో యూనిఫాం, షూస్ విక్రయించకుండా పర్యవేక్షించేందుకు అన్ని మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని డీఈవో సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలు, యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిప్యూటీ ఇన్స్‌పెక్టర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లను ఆదేశించారు.


ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఫీజు రెగ్యులేషన్ పైన కమిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వమే ఒక పోర్టల్ ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ఫీజులు చెల్లించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


ప్రైవేట్ స్కూల్స్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే ఛాన్స్ ఉందని.. స్థానికంగా స్టేషనరీ స్టోర్స్‌తో డీల్ చేసుకొని యూనిఫాం, షూస్, స్టేషనరీ అక్కడ నుంచే తీసుకునేలా తల్లిదండ్రులకు తప్పనిసరి పరిస్థితి కల్పించే ప్రమాదం ఉందని కొంత మంది నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇలా చేస్తున్నాయని చెబుతున్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM