అమ్మానాన్న మాట వినుంటే ఈరోజు సంతోషంగా ఉండేదాణ్ని.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

byసూర్య | Fri, May 31, 2024, 07:57 PM

తనను ప్రేమించాలంటూ యువతి వెంటపడ్డాడు. తొలుత ఆమె తిరస్కరించింది. నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ప్రాధేయపడ్డాడు. అదంతా నిజమని నమ్మి, ఆ అమ్మాయి ఓకే చెప్పింది. ఇంత కాలం కలిసి మెలిసి తిరిగి 4 నెలలుగా తీవ్ర వేధింపులకు గురిచేశాడు. రూ. 70 లక్షల కట్నం ఇస్తేగానీ పెళ్లి చేసుకోనన్నాడు. నడి వీధిలో అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కదిలిస్తోంది. అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.


బాలబోయిన అఖిల (22) అనే యువతి కొన్నేళ్లుగా తన తల్లిదండ్రులతో కలిసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎల్‌బీ నగర్‌లో నివాసం ఉంటోంది. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. షాపూర్‌నగర్‌కు చెందిన అఖిల్‌ సాయిగౌడ్‌ 8 ఏళ్ల కిందట ప్రేమ పేరుతో అఖిల వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకునేంత వరకు వెంటపడ్డాడు.


వీరి ప్రేమ విషయం అఖిల తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను మందలించారు. ప్రేమ పేరుతో కెరీర్‌ను, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. అయితే, అఖిల్ గౌడ్ మాటలను నమ్మిన అఖిల.. అతడు మంచిగా చూసుకుంటాడని, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అంగీకరించారు. అమ్మాయికి పెళ్లి జరిపించాలని భావిస్తున్న అఖిల తల్లిదండ్రులు అఖిల్‌ను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడారు. ఇద్దరికీ పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. అయితే, కొన్ని నెలలుగా అఖిలను అఖిల్ గౌడ్ వేధింపులకు గురిచేస్తున్నాడు. భారీ మొత్తంలో కట్నం ఇస్తేగానీ పెళ్లి చేసుకోనని దుర్భాషలాడాడు. ఆమె నిలదీయడంతో పబ్లిక్‌గా చేయి చేసుకున్నాడు. ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌లు పెట్టి వేధించాడు.


మోసపోయానని గ్రహించిన అఖిల తీవ్ర మనోవేదనకు గురైంది. ‘అమ్మా - నాన్న మాట విని ఉంటే ఈ రోజు సంతోషంగా ఉండేదాన్ని’ అంటూ 14 పేజీల లేఖ రాసి మంగళవారం (మే 28) ఆత్మహత్య చేసుకుంది. అఖిల్ తనను ఏవిధంగా వేధించాడో లేఖలో వివరించింది. అఖిల తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె యువకుడి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకోవడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరే ఇతర అమ్మాయి ఇలా మోసపోకుండా శిక్షించాలని బంధువులు కోరుతున్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల ఎస్సై ఆంజనేయులు తెలిపారు.



Latest News
 

ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM
మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM