చిన్నపిల్లలను తీసుకొచ్చి చాక్లెట్లలా అమ్మేస్తున్నారు.. హైదరాబాద్‌లో హైటెక్ ముఠా అరెస్టు

byసూర్య | Tue, May 28, 2024, 08:41 PM

హైదరాబాద్‌లో చిన్న పిల్లలను విక్రయిస్తు్న్న హైటెక్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ అంతర్‌రాష్ట్ర ముఠా పనిచేస్తున్నట్లు రాచకొండ కమిషనరేట్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్కో చిన్నారిని రూ. 1,80,000 నుంచి రూ. 5,50,000 వరకు ధర కట్టి అమ్మేస్తున్నారు. ఓ మహిళా డాక్టర్ ఈ ముఠాతో చేతులు కలిపి పిల్లలను విక్రయిస్తున్నారు. ముఠా వద్ద నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు పోలీసులు. వీరిలో ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు రాచకొండ కమిషనరేట్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ఉప్పల్ సమీపంలోని మేడిపల్లి చోటు చేసుకున్న ఘటన అనంతరం పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ హైటెక్ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


మేడిపల్లి సమీపంలోని పీర్జాదిగూడలో మే 22న రూ.4.50 లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్‌ శోభారాణి ఓ శిశువును విక్రయించారు. స్వప్న, షేక్ సలీం అనే మరో ఇద్దరు ఆమెకు సహకరించారు. గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని విక్రయిస్తుండగా.. రిపోర్టర్ మన్యం సాయికుమార్ గుర్తించి, కాపాడారు. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.


హేమలత అలియాస్ స్వప్న, షేక్ సలీమ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, పుణే తదితర ప్రాంతాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంతానంలేని దంపతులకు పిల్లలను విక్రయించారు. ఇప్పటివరకు ఈ ముఠా 50 మంది చిన్నారులను ఇలా విక్రయించినట్లు మేడిపల్లి పోలీసుల విచారణలో తేలింది.


ఢిల్లీలో కిరణ్, ప్రీతి; పుణేలో కన్నయ్య అనే వ్యక్తులు ఈ ముఠాలో కీలకంగా ఉన్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. వీరు ఢిల్లీ, పుణే ప్రాంతంలో నిరుపేద తల్లిదండ్రుల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని.. రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చి చిన్నారులను కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేసిన చిన్నారులను హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని విక్రయించడం ద్వారా లక్ష నుంచి 4 లక్షల రూపాయల వరకు సొమ్ము చేసుకుంటున్నారు.


దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్‌ జోషి మంగళవారం (మే 28) మీడియాకు వెల్లడించారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్లు మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేసిన సమయంలోనే ఇద్దరు చిన్నారులను రక్షించామని చెప్పారు. ఢిల్లీ, పుణేలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని సీపీ తరుణ్ జోషి తెలిపారు.


Latest News
 

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి. Tue, Jan 14, 2025, 09:55 PM
గాలిపటం ఎగరేసేందుకు గుట్టపైకి పిల్లలు.. పొదల మాటున కనిపించిన సీన్ చూసి షాక్ Tue, Jan 14, 2025, 09:03 PM
కల్వకుంట్ల కవిత ఇంట్లో స్పెషల్ సంక్రాంతి.. వెల్లివిరిసిన సంతోషం Tue, Jan 14, 2025, 08:57 PM
చోరీ చేసి పారిపోతూ ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు Tue, Jan 14, 2025, 08:50 PM
ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Jan 14, 2025, 08:46 PM