తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు.. ఆ ఉద్దేశంతోనే తొలగింపు: సీఎం రేవంత్

byసూర్య | Tue, May 28, 2024, 07:36 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర గీతం, కొత్త అధికారిక చిహ్నన్ని కూడా తీసుకురానున్నట్లు ఇది వరకే ప్రకటించారు. రాష్ట్ర గీతాన్ని స్వరపరచడానికి ఇప్పటికే కీరవాణితో చర్చలు జరిపారు.


తాజాగా అధికారిక చిహ్నం మార్పుతో పాటు పలు అంశాలపై రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉండబోతుందని చెప్పారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు అని.. రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని తెలిపారు. అందుకే అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని అన్నారు. రాజముద్ర రూపకల్పన బాధ్యతను నిజామాబాద్‌కు చెందిన ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ అందిచామన్నారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నన్ని రూపొందిస్తామన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉటుందని చెప్పారు.


జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీకే రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయనికే వదిలేసానని చెప్పారు. అందెశ్రీనే కీరవాణిని ఎంపిక చేశారని.. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర, నిర్ణయం లేదని సీఎం వెల్లడించారు.


తెలంగాణలో అత్యంత పారదర్శకంగా పాలన సాగుతుందని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని.. దాని ఆధారంగానే ముందుకు వెళతామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నుముక్క విరిగిందని.. తాను ముందే చెప్పినట్లు గుర్తు చేశారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం. తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్‌పై సమీక్ష జరపలేదన్నారు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇంకా రివ్యూ చెయ్యలేదని వెల్లడించారు. అన్నింటికీ సీబీఐ విచారణ అడిగే హరీష్ రావు కేటీఆర్.. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐకి ఇవ్వాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.


ఫోన్ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని.. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని.. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య, కోతలు లేవని చెప్పారు. కొన్ని చోట్ల వర్షాల కారణంగా కరెంట్ సరఫరాలో అవంతరాలు వచ్చాయన్నారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామని.. ఎక్కడా అధికార దుర్వినియోగం చేశామని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేదని సీఎం అన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM