ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ పాత్ర.. హైకోర్టులో సంచలన విషయాలు చెప్పిన ఈడీ

byసూర్య | Tue, May 28, 2024, 07:33 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలన విషయం తాజాగా బయటికి వచ్చింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ముందే తెలుసని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని మొత్తం ముందే కల్వకుంట్ల కవిత.. కేసీఆర్‌కు చెప్పిందని ఈడీ వివరించింది. ఆ సమయంలోనే ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన వారు కేసీఆర్‌కు పరిచయం అయ్యారని పేర్కొంది. కేసీఆర్‌కు ఢిల్లీ నివాసంలో తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ పాత్ర గురించి.. ఢిల్లీ హైకోర్టులో ఈడీ తెలిపింది.


ఢిల్లీ మద్యం వ్యవహారంలో కవిత బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం ఈడీ అధికారులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సంచలన విషయాలను ఈడీ కోర్టు ముందు ఉంచింది. ఈ మద్యం వ్యాపారం గురించి కేసీఆర్‌కు.. కల్వకుంట్ల కవిత ముందే వివరాలు చెప్పారని కోర్టుకు తెలిపింది. కవిత తన టీమ్‌ సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లైలను.. ఢిల్లీలో కేసీఆర్‌కు పరిచయం చేశారని పేర్కొంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు సమీర్‌ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేసినట్లు తెలిపింది. సమీర్ మహేంద్రను అడిగి ఢిల్లీ మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్‌ తెలుసుకున్నారని ఈడీ వివరించింది.


కేసీఆర్‌తో సమావేశం అయిన వివరాలను గోపీ కుమరన్‌ వాంగ్మూలంలో రికార్డు చేశారని ఈడీ తెలిపింది. రెండేళ్లలో కవిత సుమారు 11 సెల్‌ ఫోన్లను ఉపయోగించారని.. అందులో 4 ఫోన్లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ క్రమంలో కల్వకుంట్ల కవితకు బెయిల్‌ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇక తీర్పును ఢిల్లీ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM