చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.. ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇస్తారంటే

byసూర్య | Mon, May 20, 2024, 06:57 PM

మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ప్రతి ఏటా పంపిణీ చేసినట్టుగానే.. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8 వ తేదీన శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రవేశిస్తున్న సందర్భంగా.. ఆ సమయం నుంచే చేప మందును పంపిణీ చేయనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.


జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి తర్వాతి రోజు.. జూన్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. చేప ప్రసాదాన్ని భక్తులకు పూర్తి ఉచితంగా అందిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం.. పలు ఫౌండేషన్ల సహకారంతో.. 24 గంటల పాటు వైద్య సేవలు, భోజన సౌకర్యం, మంచి నీటి సరఫరా చేయనున్నట్టు వివరించారు.


అయితే.. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప మందు ప్రసాదాన్ని అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విధంగానే.. ఈ ప్రభుత్వాన్ని కూడా తగిన ఏర్పాట్లు చేయాలని కోరామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. చేప ప్రసాదం పంపిణీకి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు వివరించారు.


177 ఏళ్లుగా చేప మందు ప్రసాదం పంపిణీ..


ఇదిలా ఉంటే.. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చేప ప్రసాదం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుంటారు. 1847లో హైదరాబాద్‌ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైందని చెప్తుంటారు. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆయన తర్వాత వారి కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా పంపిణీ చేశారు.


ఆ తర్వాత.. శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. మధ్యలో కోవిడ్‌ కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేళ్ల పాటు నిలిచిపోగా... గతేడాది నుంచి చేప ప్రసాద పంపిణీకి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాగా.. వయో భారంతో బత్తిని హరినాథ్‌ గౌడ్ 2023లో మృతి చెందారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM