byసూర్య | Mon, May 20, 2024, 06:54 PM
ఇన్ని రోజులు మగవాళ్లే తమ భార్యలపై చేయి చేసుకునేవారు. కానీ.. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు. పీకలదాకా తాగొచ్చి భార్యలను కొట్టే భర్తలపై.. గృహహింస, వరకట్న వేధింపుల చట్టం కింద కేసులు పెట్టి వాళ్ల మత్తు వదలగొడుతున్నారు. ఒకవేళ అప్పటికీ దారికి రాకపోతే.. నీకూ నాకూ రాంరాం అంటూ విడాకులు ఇచ్చేసి.. స్వతంత్రంగా బతికేస్తున్నారు.
ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు కూడా ఉందండోయ్. భర్తలే కాదు.. భార్యలు కూడా చేతులకు పని చెప్తున్నారు. నాలుగు గోడల మధ్య ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య రోజూ చితకబాదుతుందంటూ ఓ భర్త కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. మామూలుగా పోలీస్ స్టేషన్‌కు వెళితే తన బాధ అర్థం చేసుకుంటారో లేదో అనుకున్నాడో ఏమో.. ఒంటి మీద బట్టలేమీ లేకుండా కేవలం డ్రాయర్‌తో పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
తన భార్య నుంచి తనను కాపాడాలంటూ పోలీసులను ఆ బాధిత భర్త వేడుకున్నాడు. తనను ప్రతిరోజూ కొడుతుందంటూ గుక్కతిప్పుకోకుండా తన బాధలు చెప్పుకున్నాడు. ఆ భర్త బాధలు విన్న పోలీసులు కూడా అతని మీద సానుభూతి వ్యక్తం చేసి.. భార్యాభర్తలకు సర్ధి చెప్పి పంపించారు. ఆ భర్త బాధలు విన్న స్థానికులు.. "నీ కష్టం పగోనికి కూడా రావొద్దు భయ్యా.." అంటూ సానుభూతి ప్రకటించారు. ఎంత బాధ అనుభవిస్తే.. ఇలా బయటకు వచ్చి తన గోడు వెల్లబోసుకుంటాడంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే.. ఆ భార్య తన భర్తను ఎందుకు కొడుతుంది.. అతను ఎలాంటి పనులు చేస్తే ఆమె ఇలా రియాక్ట్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది.