byసూర్య | Mon, Apr 22, 2024, 08:53 PM
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మన దేశ కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ముక్క నివేశ్ (20), జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్ (19) అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. శని, ఆదివారాలు వరుసగా సెలవులు రావటంతో వీరిద్దరూ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వాటర్‌ఫాల్స్ చూసేందుకు సరదాగా బయలుదేరారు.
అయితే వీరు ప్రయాణిస్తున్న కారును ఫినిక్స్ పరిధిలోని మెట్రోటౌన్ సెంటర్ వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నివేశ్, గౌతమ్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాక్సిడెంట్ ఘటనపై అరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్ మరో నెలరోజుల్లో ఇండియాకి తిరిగి వచ్చేవాడు. ఇండియాకు తిరిగి రావడానికి మే 22న టికెట్ బుక్ చేసుకున్నాడు కూడా. నెలరోజులైతే ఇంటికి వచ్చి తమతో సంతోషంగా గడిపేవాడని గౌతమ్ తల్లిదండ్రులు పార్శి కమల్ కుమార్ గుప్తా పద్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.