ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి.. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి: క్రిశాంక్

byసూర్య | Sun, Apr 21, 2024, 10:18 PM

తెలంగాణలో ప్రస్తుతం లోక్ సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత.. ఊహించని విధంగా ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదలటంతో.. ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున అంతకుముందు నుంచే టికెట్ ఆశిస్తున్న మన్నె క్రిశాంక్.. లాస్య నందిత మృతి చెందిన రోజున ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇది సందర్భం కాదు అని చెప్తూనే.. లాస్య నందిత కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలంటూ ట్వీట్ చేయటం ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది.


కాంగ్రెస్‌లో ఉన్న సమయంలోనే రెండు సార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారగా.. అదే నిరాశతో బీఆర్ఎస్‌లోకి వచ్చిన క్రిశాంక్.. 2023 ఎన్నికల్లో కచ్చితంగా టికెట్ తనకే వస్తుందన్న దీమాతో క్షేత్రస్థాయిలో తీవ్రంగా కష్టపడ్డారు. అయితే.. అనూహ్యంగా ఎన్నికలకు ముందే సాయన్న అకాల మరణం చెందగా.. ఆయన కూతురు లాస్య నందితకు టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ పెద్దల నుంచి అభిప్రాయం రావటంతో.. నాయకత్వ నిర్ణయాన్ని శిరసా వహించారు. ఏమాత్రం నిరాశ చెందకుండా లాస్య నందితను గెలిపించేందుకు కూడా చాలా కష్టపడ్డారు. ఇక.. లాస్య నందిత కూడా అకాల మరణంతో మళ్లీ కంటోన్మెంట్‌లో ఎన్నిక అనివార్యమైంది. ఈసారైనా.. తనకు టికెట్ వస్తుందని ఆశించాల్సిన క్రిశాంక్.. లాస్య నందిత ఫ్యామిలీలోని వ్యక్తికే అవకాశం ఇవ్వాలని కోరుకోవటం వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది.


"సమయం తెలుగు"కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తాను ఆ పోస్టు పెట్టటం వెనుక జరిగిన అంతర్మాథనం గురించి చెప్పుకొచ్చారు. లాస్య నందిత చనిపోయిన సమయంలో తాను ఎంతగానో బాధపడ్డానని.. కానీ అదే టైంలో సోషల్ మీడియాలో ఎన్నో దిగజారుడు ఆరోపణలు తనపై చేసినట్టుగా క్రిశాంక్ తెలిపారు. లాస్య నందితను చంపించింది క్రిశాంకే అంటూ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఆ సమయంలో తాను ఎంతగానో బాధపడ్డానని.. ఈ సీటు తనకు వద్దని బలంగా ఫిక్సయినట్టు చెప్పుకొచ్చారు. తాను పార్టీ కోసం నిజాయితీగా పని చేసే కార్యకర్తనని.. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి అంతే నిజాయితీగా పని చేశానని.. కానీ సీటు కోసం అంత దుర్మార్గానికి ఒడిగట్టే వ్యక్తిని కాదని వివరించారు. సోషల్ మీడియాలో ఆ ఆరోపణలు పడలేకనే.. ఆ సీటును వాళ్లు కుటుంబానికే ఇవ్వాలని పోస్టు పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు క్రిశాంక్.


ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దిగజారుడు పోస్టులకు బలంగానే కౌంటర్లు ఇస్తున్నారేంటీ అని అడిగిన ప్రశ్రకు.. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలంటూ అసహనం వ్యక్తం చేశారు క్రిశాంక్. అందుకే తాము కూడా సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్లు ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు క్రిశాంక్. గతంలో పలు మార్లు హెచ్చరించామని.. కానీ వాళ్లు వినట్లేదని.. అందుకే తాము కూడా ట్రోలింగులు, మార్ఫింగులు చేయగలమని నిరూపించేందుకే కౌంటర్ ఎటాక్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.


ఇక.. నివేదిత పేరును ప్రకటించే రోజు ఉదయం తాను ఓ ఎమోషనల్ ట్వీట్ చేయగా.. దానికి కూడా వివరణ ఇచ్చారు క్రిశాంక్. నాలుగు సార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవటంతో.. ఇంట్లో తన భార్యతో పాటు కేడర్ అంతా ఎంతో బాధపడ్డారని తెలిపారు. తన భార్య ఎన్నో నోములు, పూజలు, ఉపవాసాలు చేశారని.. కానీ చివరికి రాకపోయేసరికి చాలా బాధపడ్డామని.. అందుకే ఆ ట్వీట్ చేసినట్టుగా క్రిశాంక్ చెప్పుకొచ్చారు.


అన్ని అవకాశాలు ఇచ్చి, పార్టీలో సముచిత స్థానం కల్పించినప్పటికీ చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న సమయంలో.. క్రిశాంక్ మాత్రం ఎందుకు పార్టీ మారట్లేదు అన్న ప్రశ్నకు కూడా క్రిశాంక్ సమాధానం ఇచ్చారు. తాను బాధల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో కేటీఆర్‌ను, కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని ఎంతగా తిట్టినా.. ఏమీ మనసులో పెట్టుకోకుండా తనను దగ్గరికి తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం తనను కూడా ఓ కుటుంబ సభ్యునిగా చూస్తుందని వివరించారు.


తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు.. కేసీఆర్ తనను 10 రోజుల పాటు తన ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టుకుని.. ఎన్నో విలువైన విషయాలు చెప్పారని క్రిశాంక్ తెలిపారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎలా ఉండాలన్న ఎన్నో విషయాలు వివరించారని చెప్పారు. అందరిలా రియల్ ఎస్టేట్ అని బిజినెసులు.. పార్టీలు జంప్ చేయటం లాంటి పనులు చేసి ఇబ్బంది పడొద్దని.. తనకు 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉందని.. దాన్ని పాడు చేసుకోవద్దని విలువైన మాటలు చెప్పినట్టుగా వివరించారు. ఆ మాటలు తనను ఎంతగానో ఉత్తేజపరిచాయని.. ఆ కుటుంబంతో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందని తెలిపారు. అందుకే.. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్‌తోనే.. కేసీఆర్, కేటీఆర్‌తోనే తన ప్రయాణం ఉంటుందని చెప్పుకొచ్చారు క్రిశాంక్.


Latest News
 

తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ Mon, Sep 23, 2024, 08:57 PM
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు ట్రైన్లు రద్దు Mon, Sep 23, 2024, 08:52 PM
'దేవర' టికెట్ల ధరలు భారీగా పెంపు.. అదనపు షోలకూ పర్మిషన్ Mon, Sep 23, 2024, 08:49 PM
కేఏ పాల్ పిటిషన్ ఎఫెక్ట్.. ఆ 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు Mon, Sep 23, 2024, 07:52 PM
సీఎం రేవంత్ సోదరుడికి భారీ ఊరట.. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే Mon, Sep 23, 2024, 07:48 PM