byసూర్య | Sat, Apr 20, 2024, 09:26 PM
తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 దాటితే ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. మండుతున్న ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పారు.
నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. నేడు సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నారాయణపేట కొమరంబీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, కరీంనగర్, జనగామ, హన్మకొండ, సిద్ధిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల్లోనూ చిరు జల్లులు పడతాయి. ఆకాశం మేఘావృతం కావటంతో పాటు చల్లటి వాతావరణం ఉంటుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండే ఛాన్స్ ఉందన్నారు.