byసూర్య | Sat, Apr 20, 2024, 09:10 PM
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కుమారుడు చేసిన ఓ యాక్సిడెంట్ తల్లి ప్రాణం తీసుకునేలా చేసింది. కుమారుడిపై పోలీసు కేసు నమోదవుతున్న భయంతో తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి..ఫిల్మ్‌నగర్ దీన్‌దయాళ్‌నగర్‌లో ఉంటున్నారు. బుధవారం తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో వీరి కుమారుడు (14) బైక్ తీసుకొని బయటకు వెళ్లాడు.
హకీంబాబా దర్గా సమీపంలో ఆగిఉన్న బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు కొంతమేర దెబ్బతినడంతో కారు డ్రైవర్ చంద్రశేఖర్ బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి వద్ద నుంచి బైక్ తాళంచెవి లాక్కున్నాడు. అనంతరం తన స్నేహితుడు మహేష్‌ను రప్పించి, బాలుడిని, బైక్‌ని సమీపంలోని కారు యజమాని ఇంటి సమీపంలో నిలిపారు. మీ కుమారుడు యాక్సిడెంట్ చేశాడని.. కారు రిపేర్‌కు రూ.20 వేలవుతుందని బాలుడి తండ్రికి చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. డబ్బులిచ్చి బైక్ తీసుకెళ్లాలని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదవుతుందని బెదిరించారు.
యాక్సిడెంట్ చేసిన విషయం తల్లి సూర్యకుమారికి కూడా తెలిసింది. ఆందోళనకు గురైన సూర్యకుమారి.. డబ్బులు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితి లేదని, కుమారుడిపై కేసు నమోదవుతుందని భర్తకు చెప్పింది. తీవ్రమనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన భర్తకు భార్య విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించాడు. భర్త ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ చంద్రశేఖర్, మహేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు.