నా కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్

byసూర్య | Wed, Apr 17, 2024, 07:28 PM

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌పై ఇప్పటికే ఓ యాక్సిడెంట్ కేసు నడుస్తుండగా.. మరో కేసును పోలీసులు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 45లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిలేనని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లు మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఈ కేసుపై బీఆర్ఎస్ నేత షకీల్ స్పందించారు. దుబాయ్ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమారుడు రాహిల్‌ను కేసుల్లో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని షకీల్ ఆరోపించారు.


"నా కుమారుడి తప్పు ఉంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటా. నా కుమారుడు రాహిల్ చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదు. దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలి. కేసు ట్రయల్‌లో ఉంది. నాపై రాజకీయ కక్ష వుంటే నా కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు. నా కుమారుడు పంజాగుట్ట కేసులో కారు బారికేడ్లకు తగిలితే నా కుమారుడిపై 21 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేసు పారదర్శకంగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నా. నా ఆరోగ్యం బాగాలేకపోయినా నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు." అని వీడియోలో షకీల్ పేర్కొన్నారు.


తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేశానని షకీల్ తెలిపారు. తన కుమారుడిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును ఎంకౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ ఇతర పోలీస్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. తన కుమారుడు రాహిల్ మానసిక ఒత్తిడికి గురి అయితే హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామన్నారు. ఓ విద్యార్థిపై ఇన్ని కేసులు పెడితే ఎలా అని ప్రశ్నించారు షకీల్.


"రాజకీయ నాయకులు ఆలోచించండి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు. వ్యక్తిగత కక్షతోటే నా కొడుకుపైన పోలీసులు కేసులు పెట్టారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద ఘటనపైన సీబీఐ చేత విచారణ జరిపించండి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నాకు న్యాయం చేయండి." అంటూ.. వీడియో సందేశం పంపారు.


Latest News
 

రేవ్ పార్టీ అంటే ఇదా..? నిజంగానే అలాంటి పనులు చేస్తారా Tue, May 21, 2024, 10:07 PM
వాళ్లను బజారుకీడ్చటం కరెక్ట్ కాదు.. రేవ్ పార్టీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 10:02 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Tue, May 21, 2024, 09:34 PM
ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష Tue, May 21, 2024, 09:32 PM
రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య Tue, May 21, 2024, 09:29 PM