రైతులకు సర్కారు శుభవార్త.. రూ.2 లక్షల రుణమాఫీకి విధివిధానాలు

byసూర్య | Fri, Mar 29, 2024, 10:37 PM

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే రైతు భరోసా కోసం ప్రత్యేక విధివిధానాలు రూపొందిస్తున్న సర్కారు.. రైతు రుణమాఫీకి కూడా గైడ్ లైన్స్ రెడీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి కాగా.. ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షల మేర రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై స్పందించిన వ్యవసాయం శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు.


వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్‌ సర్కార్ కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ.. ఎన్ని ఇబ్బందులున్నా.. అన్నదాతల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్‌బీఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నామని మంత్రి తుమ్మల వివరించారు. ఎన్నికల కోడ్ రావటంతో.. ఈ రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ లోక్ సభ ఎలక్షన్స్ అయిన వెంటనే ప్రకటిస్తామని తెలిపారు.


మరోవైపు.. 2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68శాతం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయన్నారు. అయితే.. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది కూడా రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో వేయలేదని చెప్పుకొచ్చారు.


2018-19 వానాకాలంలో 4 నెలల 5 రోజుల్లో వేస్తే.. అదే ఏడాది యాసంగిలో 5 నెలల 11 రోజులు పట్టిందన్నారు. ఇక.. 2019-20 వానాకాలంలో 4 నెలల 10 రోజుల్లో వేస్తే.. యాసంగిలో 1 నెల 19 రోజుల్లో వేసిందన్నారు. 2020-21 వానాకాలంలో 5 నెలల 16 రోజులు పడితే.. యాసంగిలో 2 నెలల 24 రోజులు పట్టిందని.. 2022-23 వానాకాలంలో 2 నెలల 8 రోజులు, యాసంగిలో 4 నెలల 28 రోజులు, 2023 -24 వానాకాలంలో 3 నెలల 20 రోజులు పట్టిందని మంత్రి పేర్కొన్నారు.


మరోవైపు.. ప్రభుత్వంలో ఉన్నపుడు ఏ రోజూ పంట పొలాలు సందర్శించని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు రైతులపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారంటూ తుమ్మల విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టి కేవలం సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు అన్యాయం జరిగిపోయిందంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థుతులను కూడా రాజకీయం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ అసహనం వ్యక్తం చేశారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM