హైదరాబాద్‌ నగరం కేంద్రపాలిత ప్రాంతం కానుందా.,,,సోషల్ మీడియాలో జోరుగా చర్చ

byసూర్య | Fri, Sep 22, 2023, 06:03 PM

‘మోదీ సర్కారు హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడారు. 2024 జూన్ నుంచి హైదరాబాద్ యూటీగా మారే అవకాశం ఉంది’.. ఇదీ సోషల్ మీడియాలో గత కొద్ది రోజలుగా జరుగుతోన్న చర్చ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలంటూ మోదీ సర్కారు ప్రకటన చేసిన దగ్గర్నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను యూటీ (యూనియన్ టెరిటరీ - కేంద్రపాలిత ప్రాంతం)గా చేస్తారనే టాక్ నడిచింది.


నిజాం స్టేట్ 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ను యూటీ అవుతుంది అంటూ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తుంటారు. ఈసారి ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోయినా సరే.. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా.. ఒకర్ని చూసి మరొకరు.. తమకు తోచిన రీతిలో కథలు అల్లేస్తున్నారు. 2024 నాటికి తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుంది. ఈ పదేళ్లపాటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువు 2024తో పూర్తవుతుంది. కాబట్టి అప్పుడు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారంటూ కొందరు కొత్త కొత్త లాజిక్కులు మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేసి తెలంగాణ ఇస్తామన్నా కేసీఆర్ ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్‌ను యూటీ చేస్తానంటే ఆయన కాదనడానికి లేదంటూ కొందరు భాష్యాలు చెబుతున్నారు.


హైదరాబాద్‌కు ఐటీ తెచ్చింది నేనే అని చంద్రబాబు అంటే.. 1987లోనే హైదరాబాద్‌లో తొలి సాఫ్ట్‌వేర్ బిల్డింగ్ ఉంది అని కేటీఆర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి క్రెడిట్ ఇచ్చే విషయంలో గతంలో టీడీపీ, బీఆర్ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శించుకున్నారు. హైదరాబాద్‌ ఈ స్థాయిలో ఉండటానికి కారణం చంద్రబాబే అని టీడీపీ వాళ్లు అంటే.. మరి ఐదేళ్లయినా అమరావతిని ఎందుకు కట్టలేకపోయాడని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నించారు. ఇప్పుడు హైదరాబాద్‌ను యూటీ చేస్తే.. మరో నగరాన్ని మీరు కట్టుకోండి.. అప్పుడు తెలుస్తుంది మీకు అంటూ.. టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైంది. కాబట్టి హైదరాబాద్‌ను యూటీ చేసి దేశానికి రెండో రాజధాని చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇలా చేయడం వల్ల హైదరాబాద్ ప్రాంతంలోనైనా బలపడే అవకాశం బీజేపీకి ఉంటుందని.. అదే సమయంలో ఎంఐఎంను దెబ్బతీయొచ్చనేది మోదీ ప్లాన్ అంటూ కొందరు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే.. కేంద్రం విధించే పన్నులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. రాష్ట్ర పన్నులు ఉండవు. తెలంగాణకు గుండె కాయ హైదరాబాద్ నగరం. రాష్ట్ర ఆదాయంలో మెజార్టీ వాటా హైదరాబాద్‌దే. అలాంటిది హైదరాబాద్ యూటీగా మారితే రాష్ట్రం భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతుంది. దీని ప్రభావం ప్రభుత్వం అమలు చేసే పథకాలపై పడుతుంది.


హైదరాబాద్‌ను యూటీ చేస్తామంటే.. తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా..? ఇక్కడి నేతలు ఓకే చెబుతారా..? తెలంగాణ కోసం కేంద్రమే కొత్తగా మరో రాజధాని నగరాన్ని నిర్మిస్తుందా..? హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసిన ఇప్పటి వరకూ అప్పుల సంగతేంటి..? ఇవన్నీ మాకు తెలీదు గానీ.. హైదరాబాద్‌ను యూటీ చేస్తారు అన్నట్టుంది కొందరి వైఖరి. ఒకవేళ హైదరాబాద్‌ యూటీ దిశగా ఒక్క ప్రకటన వెలువడినా.. అది ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చడం ఖాయం. అంతే కాదు పోరాటాలకు మారుపేరైన తెలంగాణ సమాజం మరోసారి ఏకమవుతుంది అనడంలో సందేహం లేదు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM