స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ పంచాయితీకి కేటీఆర్ పుల్‌స్టాప్

byసూర్య | Fri, Sep 22, 2023, 05:53 PM

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. అసంతృప్తులపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గెలుపు గుర్రాల జాబితాను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించగా.. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లంతా అలక పూనారు. కొందరైతే.. తమ అక్కస్సును బహిరంగంగానే వెల్లగక్కుతున్నారు. అలా అయినా.. అధిష్ఠానానికి తమ బాధ తెలియాలని వాళ్ల ప్లాన్ కాబోలు. అయితే.. వీటన్నింటినీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం.. ఎవరికి బుజ్జగిస్తే తమ దారికి వస్తారు.. ఎవరిని పట్టించుకోకూడదు అన్న అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. కేటీఆర్ స్వయంగా ఈ అసంతృప్తి పంచాయితీలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య విషయంలోనూ కేటీఆర్ రంగంలోకి దిగారు.


వచ్చే ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో.. ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. నియోజకవర్గంలో కార్యకర్తలను కలిసి భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. బహిరంగంగానే.. కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. నాయకత్వంపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. రెబల్‌గా మారే ఛాన్స్ ఉండటంతో.. కేటీఆరే స్వయంగా రంగంలోకి దిగి ఈ పంచాయితీని తేల్చారు.


తాజాగా ప్రగతి భవన్‌లో తాటికొండ రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో రాజయ్యను కేటీఆర్ బుజ్జగించారు. తనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సీఎం కేసీఆర్‌, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపు కోసం పనిచేయాలని కోరారు. దీంతో.. కేటీఆర్ ఇచ్చిన హామీలతో సంతృప్తి చెందిన రాజయ్య.. పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు రాజయ్య తెలిపారు. దీంతో.. ఇన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన స్టేషన్ ఘన్‌పూర్‌ పంచాయితీకి పుల్‌స్టాప్ పెట్టినట్టయింది.



Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM