అపూర్వ శిల్పాలతో బిచ్కుంద కమ్మరి గుడి శివాలయం

byసూర్య | Wed, Aug 17, 2022, 12:30 PM

బిచ్కుంద మండల కేంద్రంలోని కమ్మరి గుడి అపూర్వ శిల్పలతో అతి పురాతన చరిత్రగల శివ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయం బయటిగోడలమీది చిహ్నాలు మెదక్ జిల్లా వేల్పుగొండ తుంబురేశ్వరాలయం మీది గుర్తులను పోలివున్నాయి. శివాలయంలో పాత శివలింగం లేదు. కొత్తశివలింగం పెట్టినట్లుంది. దేవాలయంలోని గర్భగుడి పాతది రాష్ట్రకూటుల నాటిది. భూమిజ నిర్మాణపద్ధతిలో కట్టబడిన గుడి. గుడిమంటపం చాళుక్య, కాకతీయశైలుల మిశ్రమంగా వుంది. దేవాలయం పలుసార్లు ఉద్ధరణకు గురైనట్లుంది. ఆ సమయాల్లో దేవాలయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.


గర్భాలయ ద్వారం మీద లలాటబింబం చతుర్భుజియైన దేవత పైచేతుల్లో పాశాంకుశాలు, ముందుచేతుల్లో కుడిచేయి అభయహస్తం, ఎడమచేతిలో ఫలంతో అర్థపద్మాసనంలో కూర్చుని వున్న (జైనయక్షిణి? ). ఈ దేవతే వీణవంక కనిపించిందని ఆ దేవతను వింధ్యావాసిని అని కీ. శే. ఆవాల బుచ్చిరెడ్డిగారు రాసారు. కాని, వింధ్యావాసిన ప్రతిమాలక్షణాలివికావు. దేవాలయద్వారం మీద ప్రాసాదం నమూనా చెక్కివుంది.


దేవాలయద్వారబంధాల ముందర ద్వారపాలకులుగా కుడివైపు గణపతి 3గురు స్త్రీ, పురుష పరివారజనులు, ఎడమవైపు భైరవుడు స్త్రీ, పురుష పరివారజనులతో వున్నారు. ఎక్కడ కనిపించని అపూర్వ ద్వారపాలకులు. 16 కాకతీయశైలి స్తంభాలతో అర్ధమంటపం వుంది. మంటపస్తంభాలపై కాలాముఖులు అర్చిస్తున్న శివలింగం, కీర్తిముఖం, హంసలు, శివుడు కేంద్రంగా బ్రహ్మ, విష్ణువులు చెక్కబడినారు. మంటపంలోని నంది గంటలదండతో అగుపిస్తున్నది. శైలినిబట్టి రాష్ట్రకూటులకాలందని చెప్పవచ్చు.


దేవాలయం బాహ్యకుడ్యాలమీద(పాదవర్గం) దేవకోష్టాలలో శివమూర్తులు, నృత్యగణపతి శిల్పాలున్నాయి. ఈ శిల్పాలలో నందివాహనుడైన ఉమాలింగనమూర్తి సుందర విగ్రహం, అష్టభుజుడైన గజసంహారమూర్తి మరొక దేవకోష్ట శిల్పంలో, ఇంకొకచోట త్రిపురసంహారమూర్తి వున్నారు.


దేవాలయప్రాంగణంలో మరొకచోట వైష్ణవశిల్పం దశావతార పరివేష్టతుడు, పంకజనాభుని గర్భంలో బ్రహ్మతో, పాదసంవాహనంలోవున్న లక్ష్మితో, యోగముద్రతో అనంతశయనుని విగ్రహమున్నది. దేవాలయ జగతి మీద నగ్నకబంధ, శృంగారశిల్పాలు చెక్కివున్నాయి. బయటపడివున్న శిల్పాలలో రెండు నల్లరాతిలో చెక్కిన కాకతీయశైలి ద్వారపాలకుల విరిగిన విగ్రహాలున్నాయి. 5, 1 పడగలతో నరసర్పరూపాల నాగులజంట తోకలవద్ద అల్లుకుని శృంగారభంగిమలో కనిపిస్తున్నది. మరొక 5పడగల పురుషనాగశిల్పం కత్తిడాలు ధరించివున్నది. గుడిప్రాంగణంలో రావిచెట్టుకానించిపెట్టిన 3నాగుల రాతిఫలకం వుంది.


దేవాలయంవద్ద కనిపించిన ఒక రాతిస్తంభంమీద తెలుగులిపిలో, తెలుగుభాషలో చెక్కిన చిన్నశాసనముంది. చాలా వరకు శాసనాక్షరాలు అరిగి, చెదిరిపోయాయి. కమ్మరి చెరువు కూడ ఉండటం విశేషం. శ్రావణ మాసంలో భక్తులు పూజలు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM