హైదరాబాద్ మెట్రోకు గతనాటి వైభవం..కిట్టకిట్టలాడుతన్న ప్రయాణికుల రద్దీ

byసూర్య | Wed, Aug 10, 2022, 09:28 PM

నిత్యం ప్రయాణికులతో కళకళలాడే హైదరాబాద్ మెట్రో రైల్ కు మరోమారు నాటి వైభవం సంతరించుకొంది. కరోనాతో నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన మెట్రో మళ్లీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతోంది. కరోనా అనంతరం సోమవారం(ఆగస్టు 8) అత్యధిక మంది మెట్రోలో ప్రయాణించారు. ఒక్కరోజు 3.94 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఈ స్థాయిలో ఆదరన లభించడం రెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారని తెలిపారు. నిత్యం మెట్రోలో ప్రయాణీకుల సగటు 3.50 లక్షల నుంచి 3.60 లక్షల మధ్యన ఉంటోందని ఎల్‌ అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ తర్వాత ఈనెల 8న అత్యధికంగా 3.94 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు నమోదయ్యాయని వెల్లడించారు.


2020 ఏప్రిల్‌కు ముందు మెట్రో రైళ్లలో సగటున రోజూ 4 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో నాలుగున్నర లక్షలు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. 5లక్షల మార్కు దాటడానికి ఎంతో సమయం పట్టదని అధికారులు అంచనా వేస్తున్న సమయంలో కరోనా రూపంలో పిడుగు పడింది. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో రైళ్లన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ ఏడాది జూన్‌ 1 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు తొలగినా మెట్రోపై మాత్రం కొనసాగాయి. 169 రోజుల అనంతరం పునఃప్రారంభమైనా రెండోవేవ్‌ భయంతో మెట్రో రైళ్లు ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇళ్లకే పరిమితం కావడం మెట్రోను బాగా దెబ్బతీసింది.


నగరంలో ఇతర ఉద్యోగుల కంటే ఐటీ ఉద్యోగులే మెట్రోలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో 35 శాతం వరకు ఉద్యోగులు ఆఫీసులకు వచ్చిన పనిచేస్తున్నారు. కొద్దినెలల క్రితం ఇది కేవలం 10 శాతం మాత్రమే ఉండేది. ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వెళ్తుండటంతో మెట్రోకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. పైగా ఇటీవల ఈ రంగంలో లక్షన్నర మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. సహజంగానే కొత్తతరం మెట్రోలో రాకపోకలకు ఇష్టపడుతున్నారు. దీంతో నాగోల్‌-రాయదుర్గం మార్గంలో ప్రయాణికుల భారీగా సంఖ్య పెరిగింది. ఇక మియాపూర్‌-ఎల్బీనగర్‌ రూట్ ఎప్పుడూ రద్దీగానే ఉంటూ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. వర్షాలు, ట్రాఫిక్‌ సమస్యలపై నగరవాసులు చాలామంది మెట్రోకే జై కొడుతున్నారు.


అయితే మెట్రో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య స్థిరంగా ఉండటం లేదు. ఒక్కోరోజు నాలుగు లక్షలకు చేరువైతే.. ఆ మరుసటి రోజే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. హాలిడే కార్డుతో సెలవు రోజుల్లోనే ప్రయాణీకులు సంఖ్య బాగానే ఉంటున్నా.. అంచనాలను మాత్రం అందుకోవడం లేదు. అయితే ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఆఫీసులకు వస్తే త్వరలోనే 5లక్షల మార్కును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మెట్రో అధికారులు చెబుతున్నారు.


Latest News
 

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM
బియ్యపు గింజ పై శ్రీరామ నామం Tue, Apr 16, 2024, 11:27 AM
వెండి కిరీటాలు బహుకరణ Tue, Apr 16, 2024, 11:14 AM
టూరిజం కోర్సులకు దరఖాస్తులు Tue, Apr 16, 2024, 10:46 AM
నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి Tue, Apr 16, 2024, 10:44 AM