పురిటిగడ్డపై అడుగుపెట్టిన కాక‌తీయ‌ వారసుడు..!

byసూర్య | Thu, Jul 07, 2022, 03:22 PM

చారిత్రక వరంగల్ నగరంలో జూలై 7వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కాకతీయ వైభవ వారోత్సవాలలో ప్రత్యేక అతిథిగా పాల్గొనడానికి ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని జగదల్పూరులో కాకతీయుల వారసులుగా భావిస్తున్న కమల్ ‌చంద్ర భంజ్‌ ‌దేవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కాకతీయుల సామ్రాజ్యం అంతమైన దాదాపు 800 సంవత్సరాల అనంతరం కాకతీయుల వారసులు ఓరుగల్లు గడ్డపై ఒక చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అడుగుపెడుతుండడంతో ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. వరంగల్లుకు వస్తున్న ఈ కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్‌ ‌దేవ్ ఎవరు? వీరి సామ్రాజ్యం ఎక్కడ ఉంది? కాకతీయులకు ఈ భంజ్‌ ‌దేవ్ వంశస్తులకు సంబంధం ఏమిటి? వీరు ఇన్నేళ్ల తర్వాత కాకతీయుల రాజధాని వరంగల్ గడ్డకు రావడంపై ఒక్క వరంగల్ మాత్రమే కాదు మొత్తం తెలంగాణా ప్రజల్లో ఆ మాటకొస్తే తెలుగు ప్రజలందరిలో ఆసక్తి నెలకొని ఉంది. వీరెవరూ, వీరి చరిత్ర ఏమిటీ, ప్రతాపరుద్రుడితోనే కాకతీయ రాజ్యం అంతం కాలేదా ? కాకతీయులకు నిజంగానే భంజ్‌ ‌దేవ్ వంశస్థులు వారసులా అనే వివరాలు తెలుసుకుందాం. దక్షిణాపథాన్ని దాదాపు రెండు శతాబ్దాలకు పైగా పాలించిన కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు చివరి రాజు.

1290 నుండి 1323 వరకు పాలించిన ప్రతాపరుద్రుడు ఢిల్లీ తుగ్లకుల దాడిలో ఓటమిపాలయ్యారు. గయాసొద్దీన్ తుగ్లక్ కుమారుడైన ఉలుఘ్ ఖాన్ చేతిలో ఓటమి చెందిన ప్రతాపరుద్రుడిని, తమ్ముడు అన్నమదేవుడిని, ఆయన మంత్రి గన్నమనాయకుడిని బందీలుగా చేసుకొని ఉలుఘ్ ఖాన్ ఢిల్లీ బయలుదేరాడు. ఓటమి అవమానాన్ని తట్టుకోలేక ప్రతాపరుద్రుడు ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనేది ఒక కథనం. వీరి వెంట ఉన్న ప్రతాపరుద్రుడి తమ్ముడైన అన్నమదేవుడు మార్గమధ్యంలో తప్పించుకొని దండకారణ్య ప్రాంతానికి పారిపోయాడట. అలా వెళ్ళిన అన్నమదేవుడు బస్తర్‌లో రాజ్యాన్ని స్థాపించేందుకు స్థానిక గిరిజనులను సమీకరించాడు. అన్నమదేవుడు సైన్యాన్ని సమకూర్చుకుని ఒకదాని తర్వాత మరొకటి రాజ్యాలను జయిస్తూ వచ్చాడు.
అన్నమదేవుడు శంఖినిడంఖిని నది ఒడ్డున దంతేశ్వరీదేవి పేరుతో గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మరోరకంగా కూడా ఈ ప్రాంతాన్ని మహిమాన్వితంగా భావిస్తారు. దక్ష యజ్ఞంలో పార్వతీదేవి మనస్తాపం చెంది యోగాగ్నిలో చనిపోవడం జరిగిందని చెప్పే పురాణకథ ఇక్కడే జరిగిందని భావిస్తారు. పార్వతి సతి నిర్వహించిన సమయంలో ఆమె పన్ను ఇక్కడ పడిందని అందుకే ఈ దేవి దంతేశ్వరి అని, ఈ ప్రాంతాన్ని దంతెవాడ అని పిలుస్తారట. వరంగల్‌లో కాకతీయులకు కాకతిదేవి ఎలా కులదేవతో, బస్తర్‌లోని అన్నమదేవుని వంశస్థులైన కాకతీయులకు దంతేశ్వరీదేవి ఆ విధంగా కులదేవతగా పూజలందుకుంటున్నది.

దట్టమైన అటవీ ప్రాంతమైన బస్తర్ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలుస్తారు. త్రేతాయుగంలో కోసల రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీస్తుపూర్వం 450 ప్రాంతంలో బస్తర్ రాజ్యాన్ని నలవంశరాజు భావదత్తుడు పాలించేవాడు. క్రీ.పూ. 440–460 మధ్యకాలంలో వాకాటక వంశరాజైన నరేంద్ర సేనునిపై భావదత్తుడు దండెత్తినాడని చెప్పే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బస్తర్‌లో కాకతీయ వంశస్తుల పాలన విషయానికి వస్తే– 1223లో దండకారణ్యానికి వచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న అన్నమదేవుని తర్వాత క్రీ.శ.1369 నుండి క్రీ.శ.1410 వరకు హమీరదేవుడు క్రీ.శ.1410 నుండి క్రీ.శ.1468 వరకు బైటాయ్ దేవుడు, క్రీ.శ. 1468 నుండి క్రీ.శ. 1534 వరకు పురుషోత్తమదేవుడు, క్రీ.శ. 1602 నుండి 1625 వరకు ప్రతాపరాజాదేవ్, క్రీ.శ.1680 నుండి క్రీ.శ. 1709 వరకు దిక్పాలదేవ్, క్రీ.శ.1709 నుండి రాజపాలదేవ్ పాలించారు. రాజపాలదేవ్‌కు ఇద్దరు భార్యలు. భాఘేలా వంశానికి చెందిన మొదటి భార్యకు డకిన్‌సింగ్ అనే కుమారుడు, చందేలా వంశానికి చెందిన రెండవ భార్యకు దళపతిదేవ్, ప్రతాప్‌లనే ఇద్దరు కుమారులు కలిగారు.

క్రీ.శ. 1721లో రాజపాలదేవ్ మరణించాక పెద్ద భార్య తన సోదరుడిని రాజుగా ప్రకటించింది. దళపతిదేవ్ తప్పించుకుని పొరుగు రాజ్యమైన జైపూరులో పదేళ్ళు ఉండి తిరిగి 1731లో సింహాసనాన్ని అదిష్ఠిస్తాడు. మొదట బస్తరులో వీరి రాజసౌధం ఉండేది. ఆ తరువాత వీరి రాజధాని జగదల్‌పూర్‌కు మారింది. 15వ శతాబ్ధిలో కాంకర్ కేంద్రంగా ఒకటి, జగదల్‌పూర్ కేంద్రంగా మరొకటి బస్తర్ రాజ్యం రెండు కేంద్రాలలో విడిగా ఉండేది. 18వ శతాబ్దిలో మరాఠా సామ్రాజ్యం ప్రాబల్యంలోకి వచ్చేవరకు వీరి రాజ్యం స్వతంత్రంగానే ఉండింది. 1861లో కొత్తంగా ఏర్పాటైన బీరార్ సెంట్రల్ ప్రావిన్సులో భాగమైంది. 1863లో 3 వేల పేష్కస్ చెల్లించే ఒప్పందంపై కోటపాడ్ ప్రాంతం జైపూర్ రాజ్యానికి ఇచ్చివేయబడింది, దీంతో క్రమంగా బస్తర్ ప్రాబల్యం తగ్గిపోయింది.

1929 నుండి 1966 సంవత్సరం వరకు పాలించిన ప్రవీర్ చంద్ర భంజ్‌ ‌దేవ్ అనంతరం బస్తర్ భారత్యూనియన్‌లో విలీనమైంది. ప్రవీర్ చంద్ర భంజ్‌ దేవ్ అంటే గిరిజనులు ఎంతో అభిమానించేవారు. ప్రవీర్‌ను ఆదివాసీల నడిచే దేవుడిగా భావించేవారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో, 1966 మార్చి 25న పోలీసులు అతన్ని అతని రాజభవనంలోనే ఎన్‌కౌంటరు పేరిట దారుణంగా కాల్చి చంపేశారు. అతనితోపాటు రాజసేవకులు, గిరిజనులు అనేకమంది హత్యచేయబడ్డారు. రాజుతో సహా 11 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు. 61 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రవీర్ చంద్ర తర్వాత, విజయ చంద్ర బాంజ్ దేవ్ 1970 వరకు, భరత్ చంద్ర భంజ్‌ దేవ్ 1996 వరకు రాజులుగా ఉండగా, ప్రస్తుత కమల్ చంద్ర భంజ్‌ దేవ్ 1996 ఏప్రిల్ నుండి రాజుగా వ్యవహరిస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM