ముత్యాలమ్మ ఆలయానికి మహిళా అఘోరి.. పూజలతో ఒక్కసారిగా ఉద్వేగం

byసూర్య | Fri, Oct 18, 2024, 10:04 PM

సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన హిందువులను ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆలయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 13న ఆలయంపై దాడి చేసి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పున:ప్రతిష్టించి శాంతి పూజలు, యాగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం (అక్టోబర్ 17)న చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి జరిపించారు. ఆ సమయంలో ముత్యాలమ్మ గుడి వద్దకు ఓ మహిళా అఘోరి (నాగా సాధు) వచ్చారు. హోమం జరుగుతున్న వద్దకు వచ్చి ఒంటి కాలిపై నిల్చొని ప్రత్యేక పూజలు చేశారు.


మహిళా అఘోరి రూపాన్ని చూసి తొలుత భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె పూజలు చేస్తుండగా భక్తిభావంతో చేతులు జోడించి నిశ్శబ్దంగా నిల్చున్నారు. ఆమెను సాక్షాత్తూ అమ్మవారే పంపించినట్లుగా భావించి నీళ్లు సాకపోశారు. ఆ మహిళా అఘోరి హూమంలో పాల్గొని, ఒంటి కాలిపై నిలబడి పూజలు చేశారు. తన చేతులతో పలు ముద్రలు చూపిస్తూ, మంత్రాలు పఠిస్తూ.. భస్మాన్ని హోమగుండంలో వేశారు. మహిళా సాధువు వచ్చి పాప ప్రక్షాళన చేసినట్లు భక్తులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘అధ్యాత్మిక క్షణం.. ముత్యాలమ్మ ఆలయంలో అఘోరి నాగ సాధువు ఆకస్మిక ప్రవేశం.


హైద్రాబాద్‌లో ఇటీవల విగ్రహ విధ్వంసం తర్వాత, ఆలయ కమిటీ శాంతి, పవిత్రతను పునరుద్ధరించడానికి సీనియర్ అర్చకులతో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. అయితే, గురువారం చండీ యజ్ఞం తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఆవిష్కృతమైంది. అఘోరి నాగ సాధువు ఆలయంలో అకస్మాత్తుగా ప్రవేశించి, అమ్మవారి ముందు ఒంటికాలిపై నిలబడి, లోతైన ధ్యానంలోకి వెళ్లిపోయారు. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం అందరినీ విస్మయానికి గురి చేసింది. హరహర మహాదేవ’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.


కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. అంతటి విశిష్టత ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం భక్తులను తీవ్రంగా కలిచివేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాల సభ్యులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళన నిర్వహించారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముత్యాలమ్మ ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాదారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.


ఇదిలాఉండగా.. మహిళా అఘోరా కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. కొన్ని రోజుల కిందట కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి వచ్చి పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన కారులో వచ్చిన ఆమెను చూసి భక్తులు తొలుత ఆశ్చర్యపోయారు. పురుష అఘోరాల మాదిరిగానే ఆమె దిగంబరురాలిగా ఉండటం, ఒళ్లంతా విభూది పూసుకొని, మెడ, చేతుల్లో రుద్రాక్ష మాలలు ధరించి, చేతిలో త్రిశూలంతో శివరూపంలో కనిపించిన ఆమెకు భక్తిభావంతో దూరం నుంచే నమస్కరించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM