హైడ్రా ఏర్పాటును సమర్థించిన హైకోర్టు, మరిన్ని అధికారాలు

byసూర్య | Wed, Oct 16, 2024, 08:46 PM

హైదరాబాద్ నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని.. హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన జీవో నెంబర్ 99, హైడ్రా కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చట్టానికి విరుద్ధం ఎలా అవుతుందని పిటిషనర్లను ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.


చట్ట విరుద్ధంగా హైడ్రా చర్యలు చేపడితే వాటిని ప్రశ్నించే అధికారం ఉంటుంది కానీ.. అసలు హైడ్రా ఏర్పాటునే ఎలా ప్రశ్నిస్తారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ చట్ట విరుద్ధంగా ప్రైవేటు ఆస్తుల్లోకి చొరబడినా.. లేదా ఆ ఆస్తులను కూల్చివేసినా నష్ట పరిహారం కోరుతూ కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్లకు హితవు పలికింది. అంతే కాకుండా కూల్చివేతలకు సంబంధించి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాతే చర్యలు తీసుకోవాలని.. తాము ఇచ్చిన ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులకు ఉల్లంఘించి హైడ్రా చర్యలు చేపడితే.. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరవచ్చని పిటిషనర్లకు తెలిపింది.


హైదరాబాద్ నగరంలో హైడ్రాను ఏర్పాటు చేస్తూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 99 చట్టబద్ధతను.. హైదరాబాద్‌ నానక్‌రాంగూడకు చెందిన లక్ష్మి, మల్కాజిగిరికి చెందిన ఎండీ అహ్మద్‌ అజీమ్‌లు.. హైకోర్టులో వేర్వేరుగా సవాల్ చేశారు. ఈ పిటిషన్‌లపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పిటిషనర్ల తరఫున లాయర్లు సుధాకర్‌రెడ్డి, విజయలక్ష్మి వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. ప్రైవేటు స్థలంలో నిర్మాణాలను హైడ్రా కూల్చివేసినట్లు కోర్టుకు విన్నవించారు. భూ ఆక్రమణల చట్టం కింద చర్యలు తీసుకునే పరిధి హైడ్రాకు లేదని తెలిపారు. జీహెచ్‌ఎంసీ చేపట్టాల్సిన చర్యలను హైడ్రా తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.


ఇక ప్రభుత్వం తరఫున.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. చట్టప్రకారం నోటీసులు జారీ చేసి ఆ తర్వాతే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి.. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అదే సమయంలో విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు.


ఇక హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జీహెచ్ఎంసీ ఆస్తులను కూడా హైడ్రా పరిరక్షించనుంది. జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, నీటి వనరులు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు సహా వివిధ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికి హైడ్రాకు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారాలు కట్టబెట్టింది.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM