ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. కోర్టుకు కూడా రాకుండానే

byసూర్య | Wed, Oct 16, 2024, 08:42 PM

గత కొంతకాలంగా నడుస్తున్న ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు (అక్టోబర్ 16న) నాంపల్లి కోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను నవంబర్‌ 14వ తేదీకి వాయిదా వేసింది. విచారణ చేపట్టాల్సిన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో.. కేసును కోర్టు వాయిదా వేసింది. అయితే.. రోజు జరిగే విచారణకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన ఇతర పనుల రీత్యా హాజరుకాలేదు. మరోవైపు.. జడ్జి కూడా లేకపోవటంతో.. విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు. దీంతో.. మరో నెల రోజుల పాటు రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కింది.


అసలు ఏం జరిగిందంటే..?


2015 జూన్ 1న జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసినందుకు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రేవంత్ రెడ్డి.. 50 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టుగా వీడియోలు బయటపడ్డాయి. ఆ సమయంలో రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వ్యవహారంపై 2018లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో రేవంత్‌ రెడ్డిని మొదటి నిందితుడిగా ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్ సన్‌తో పాటు ఇతరుల స్టేట్ మెంట్లను ఈడీ రికార్డు చేసింది. కాగా.. అదే ఏడాది రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.


ఈ కేసులో 2021 జూలై 25న ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. రేవంత్‌ రెడ్డితో పాటు మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది. ఇందులో రేవంత్‌ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద నమోదు చేసిన వాంగ్మూలంలో.. స్టీఫెన్ సన్‌ను కలిసి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేలా ఒప్పించాలని రేవంత్ రెడ్డి చెప్పినట్లు మత్తయ్య జెరూసలెం వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీకి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని, ఓటింగ్‌కు హాజరుకాకపోతే స్టీఫెన్ సన్‌కు రూ.3 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి తనతో చెప్పినట్టుగా ఈడీ అధికారులు తెలిపారు.


కాగా.. 2019 ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. రుద్ర ఉదయ్ సింహా అనే వ్యక్తితో తాను కొన్ని అంశాలపై చర్చిస్తుండగా కొందరు పోలీసులు బలవంతంగా సమీపంలోని అపార్ట్ మెంట్‌కు తీసుకెళ్లారంటూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే, రేవంత్ రెడ్డి గన్‌మెన్లు మాత్రం తమ వాంగ్మూలంలో రేవంత్ రెడ్డికి అలాంటిదేమీ జరగలేదని స్టేట్ మెంట్ ఇచ్చినట్టు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌‌ను రేవంత్‌ రెడ్డికి చూపించారని.. అందులో అతను డబ్బును హ్యాండిల్ చేసి స్టీఫెన్ సన్‌కు ఇస్తుండటం స్పష్టంగా కనిపించటంతో.. 'ఒక వ్యక్తి నాలాగే కనిపిస్తున్నాడు' అంటూ రేవంత్ రెడ్డి బుకాయించే ప్రయత్నం చేసినట్టు తెలిపారు.


మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాల దర్యాప్తులో.. రేవంత్ రెడ్డి నేరుగా ఓటుకు నోటుకు సంబంధించిన నేరంలో భాగమైనట్టుగా.. పీఎంఎల్‌ఏ సెక్షన్-4 ప్రకారం మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు తేలిందని ఈడీ అధికారులు చెప్తున్నారు. ఫిర్యాదుదారుడు ఒక నిర్దిష్ట అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయమని ప్రేరేపించడం పీఎంఎల్‌ఏ ప్రకారం నేరమేనని.. తద్వారా మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డారని వివరించారు.


ఇదిలా ఉంటే.. ఈ కేసును ఈ ఏడాది సెప్టెంబర్ 24న అభియోగాల నమోదుకు లిస్ట్ చేశారు. అయితే.. విచారణకు నిందితుడైన సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాకపోవటంతో.. అభియోగాల విచారణ నిమిత్తం ఈ నెల 16న రేవంత్ సహా నిందితులంతా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కాగా.. ఈరోజు న్యాయమూర్తి లీవ్‌లో ఉండటంతో.. తర్వాతి నెలకు వాయిదా పడింది.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM