ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందే, రిలీవ్ చేయనున్న తెలంగాణ

byసూర్య | Wed, Oct 16, 2024, 07:41 PM

కేంద్రం ఇటీవల బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, వాణీప్రసాద్, హరి కిరణ్, శివశంకర్, సృజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది.


లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాసేవ కోసమే ఐఏఎస్‌లు ఉన్నారన్న హైకోర్టు.. కేంద్రం ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లాలని సూచించింది. ట్రిబ్యునల్ పిటిషన్ కొట్టేసిందని కోర్టులకు రావడం కరెక్ట్ కాదని పేర్కొంది. మరోవైపు క్యాట్‌లో నవంబర్ నాలుగో తేదీన విచారణ ఉందన్న ఐఏఎస్ అధికారుల తరుఫు న్యాయవాది.. ఈ పదిహేను రోజుల పాటు రిలీవ్ చేయవద్దని కోరారు. అయితే స్టే ఇస్తూ పోతే ఈ వ్యవహారం ఎప్పటికీ తేలదన్న హైకోర్టు.. క్యాట్‌లోనూ సీనియర్ అధికారులు ఉంటారని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్య మరింత జఠిలం అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. క్యాట్ ఆదేశాలను సమర్థిస్తూ ఐఏఎస్ అధికారుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.


ఐఏఎస్ అధికారులు వెంటనే డీవోపీటీ కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని హైకోర్టు సూచించింది. బాధ్యతాయుతమైన అధికారులుగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని అభిప్రాయపడింది. మరోవైపు డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 16 అంటే ఇవాళ సాయంత్రంలోగా వారంతా వారి సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. క్యాట్ సైతం ఇదే ఆదేశాలు ఇచ్చింది. అయితే క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ వీరంతా హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఊరట దక్కలేదు. క్యాట్ ఆదేశాలను సమర్థిస్తూ హైకోర్టు వీరి పిటిషన్ డిస్మిస్ చేసింది.


తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నలుగురు ఐఏఎస్‌లను (ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్) కాసేపట్లో రిలీవ్ చేయనుంది. ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతుండగా.. మిగిలిన ముగ్గురు ఐఏఎస్‌లు మహిళా, శిశు సంక్షేమ శాఖ, టూరిజం, విద్యుత్ శాఖల ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. వీరి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త వారిని నియమించనుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Latest News
 

కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM