byసూర్య | Tue, Oct 15, 2024, 10:32 AM
యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
సోమవారం వేములవాడ పట్టణంలో పర్యటించిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
వేములవాడ రాజన్న ఆలయం అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదం మధ్యలో మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని కోడె మొక్కలు చెల్లించారు. రాజన్న దేవాలయం సన్నిధిలో మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమాన్ని మంత్రి కుటుంబ సభ్యులతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాజన్న దేవాలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే రాజన్న దేవాలయ అభివృద్ధి పై సీఎం స్థాయిలో అత్యున్నత సమావేశం జరుగుతుందన్నారు. శాస్త్రాల ప్రకారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని రకాల వసతులను కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకున్నామని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని అన్నారు. యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, యాదాద్రి ఆలయానికి 63 కేజీల బంగారంతో తాపడం ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయం వద్ద 65 కేజీల బంగారం 5000 కిలోల వెండి అందుబాటులో ఉందని వీటిని వినియోగించుకొని వేములవాడ ఆలయానికి సైతం బంగారు తాపడం, వెండితో పల్లకీలు, ఉత్సవ విగ్రహాలు రూపొందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి బద్ది పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఆలయ ఈ.ఓ. వినోద్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్, అర్.డి. ఓ. రాజేశ్వర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.