ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల సాగు.. మూడేళ్లపాటు ప్రభుత్వ సాయం

byసూర్య | Mon, Sep 30, 2024, 08:12 PM

తెలంగాణలో పండ్లతోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో చాలా మంది రైతులు పండ్ల తోటల సాగు వైపు మెుగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు ప్రభుత్వం కూడా ఆసరాగా నిలుస్తోంది. ప్రభుత్వ పథకమైన ఉపాధి హామీ కింద సాగు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధర్వ్యంలో నిర్వహిస్తున్న ఈ పథకానికి ఈ ఏడాది మంచి స్పందన వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా చిన్న, సన్నకారు అన్నదాతలు పండ్ల తోటల సాగుకు ముందుకొస్తున్నారు.


గత మూడు నెలల్లోనే 11 వేల ఎకరాలకుపైగా రైతులు ఈ పథకం కింద పంటలు సాగు చేస్తున్నారు. తెలంగాణలోని మెుత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు ఐదు శాతం పండ్ల తోటల సాగు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఉద్యానాల పెంపకానికి అవకాశం కల్పించడంతో తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి మండలానికి 50 ఎకరాల చొప్పున సాగు లక్ష్యాన్ని ఆ శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే చాలా మంది రైతులు సాగుకు ముందుకు రాగా.. మరో తొమ్మిది నెలల కాలంలో మరింతగా స్పందన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.


ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదై జాబ్‌కార్డులతో పనులు చేస్తున్న రైతులు ఈ పథకానికి అర్హులని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. ఐదు ఎకరాలలోపు వ్యవసాయ భూములు గల ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వర్గాల రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద రైతులకు మామిడి, సీతాఫలం, మునగ, జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి ( పొలం గట్ల వెంబడి), డ్రాగన్‌ ఫ్రూట్‌ (అరెకరాకు మాత్రమే), ఆయిల్‌ పామ్, సపోటా, బత్తాయి, అల్లనేరేడు మొక్కలను అధికారులే పంపిణీ చేస్తారు. పండ్లతోటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు సాయం అందించనుంది.


ఈ ఆర్థిక (2024-25) సంవత్సరంలో ఇప్పటి వరకు 5,660 మంది రైతులకు చెట్లను అందజేశారు. 11,659.19 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు అవుతున్నాయి. ఈ సాగుకు ప్రభుత్వం రూ.19.53 కోట్లు ఖర్చుచేసింది. తెలంగాణలోని 2.60 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలుండగా.. 5 శాతం ఈ పథకం కిందే సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెద్దఎత్తున తోటలు సాగు పెరిగింది. వచ్చే మార్చి నాటికి 27 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరిన్ని వివరాలకు గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను లేదా మండల వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని ఉద్యానవనశాఖ అధికారులు సూచించారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM